Share News

స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:48 AM

స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని, అగ్రికల్చర్‌ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్‌ వరకు స్పీడ్‌ అన్నది ఏపీ కల్చర్‌గా మారిందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.

స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన

  • స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏపీ ప్రత్యేకత

  • పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా ఫైర్‌ సైడ్‌ చాట్‌లో లోకేశ్‌

స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని, అగ్రికల్చర్‌ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్‌ వరకు స్పీడ్‌ అన్నది ఏపీ కల్చర్‌గా మారిందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘స్వర్ణాంధ్ర 2047: ది న్యూగ్రోత్‌ ల్యాబ్‌రేటరీ’ అంశంపై నిర్వహించిన ‘ఫైర్‌ సైడ్‌ చాట్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వివో మొబైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ అర్జిత్‌ సేన్‌ వ్యవహరించారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు లోకేశ్‌ సమాధానం ఇచ్చారు. ప్రతి రాజకీయ పార్టీకి ఓ కల్చర్‌ ఉంటుందని, అలాగే ప్రభుత్వాలకు కూడా ఉంటుందని తెలిపారు. ‘‘పెట్టుబడుల ఆకర్షణలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏపీ ప్రత్యేకత. పొరుగు రాష్ర్టాల్లో దశాబ్దానికి పైగా నిలిచిపోయిన ప్రాజెక్టులను ఏపీలో 18 నెలల్లోపే ప్రారంభించగలిగాం. 13 నెలల్లోనే విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ను తీసుకువచ్చాం. పౌరులకు వేగంగా సేవలందించేందుకు ‘మనమిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ను తీసుకువచ్చాం. దాదాపు వెయ్యి పౌర సేవలను వాట్సాప్‌ ద్వారా అందిస్తున్నాం.

వేగమన్నది ఏపీ ప్రభుత్వ సంస్కృతిగా మారింది. ఇది వ్యవసాయం నుంచి తయారీ రంగం వరకు, పాలన నుంచి ఐటీ వరకు అన్ని రంగాల్లో మార్పును తీసుకొస్తోంది. రాష్ట్రంలో 23 ప్రత్యేక క్లస్టర్లను అభివృద్థి చేస్తున్నాం. అవి స్పేస్‌, డ్రోన్లు, సిమెంట్‌, స్టీల్‌, మెడికల్‌ డివైసెస్‌, ఫార్మా, ఏఐ, డేటా నుంచి హార్టికల్చర్‌, ఆక్వా రంగాల వరకు విస్తరించాయి. ప్రాజెక్టులను గ్రౌండ్‌ చేయడం మా ఏకైక ప్రధాన ప్రాధాన్యం. పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో కొన్ని ఎంవోయూలు చేసుకున్నాం. మేం 80 శాతం గ్రౌండింగ్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐబీఎం నుంచి ప్రపంచంలోని తొలి 150-క్యూబిట్‌ క్వాంటం కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావడానికి కృషిచేస్తున్నాం. కేవలం కంప్యూటర్‌ను తీసుకురావడమే కాదు.. పూర్తి క్వాంటం ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తాం. ప్రస్తుతం ఏపీ 200 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. క్వాంటం ఎంత ముఖ్యమో, హార్టికల్చర్‌ కూడా అంతే ముఖ్యం. ఆక్వాకల్చర్‌ కూడా అంతే ముఖ్యం’’ అని లోకేశ్‌ అన్నారు.


విద్యా వ్యవస్థలో మార్పులు

‘ఏపీలో విద్యా వ్యవస్థ రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచే విలువలు, సాంకేతికత, లింగ సమానత్వాన్ని నేర్పేలా విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నాం. చిన్నతనం నుంచే మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, లింగ వివక్షను రూపుమాపడమే లక్ష్యంగా పాఠ్యపుస్తకాల్లో సమూల మార్పులు తెచ్చాం. మేం బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రంలో ‘ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు’ విధానం కేవలం 3 శాతం పాఠశాలల్లోనే అమల్లో ఉండేది. ప్రస్తుతం దాన్ని 33 శాతానికి చేర్చాం. ఇటీవల ఏకంగా 16,000 మంది టీచర్‌ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశాం. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా క్రమం తప్పకుండా ఉపాధ్యాయుల నియామకాలు చేపడతాం. పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్య, సాంకేతిక విద్యను కూడా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగించారు. లోకేశ్‌ పర్యటనలో ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, టీడీపీ ఎంపీలు ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 05:48 AM