Share News

విద్యతోనే మార్పు

ABN , Publish Date - Sep 21 , 2026 | 03:48 AM

విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి విద్యాశాఖను ఎంచుకున్నానని తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ‘భారతీయం’ దేశభక్తి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

విద్యతోనే మార్పు

  • ఈ సిద్ధాంతాన్ని నమ్మి విద్యా శాఖను ఎంచుకున్నా

  • గత రెండేళ్లలో శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం

  • ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ బడుల్లోకి 1.10 లక్షల మంది

  • నేను ఈ స్థాయికి చేరడం వెనుక నా తల్లి కష్టం, త్యాగం

  • 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయా

  • పడిన చోటే నిలబడతానని చాలెంజ్‌ చేసి గెలిచి చూపించా

  • ‘భారతీయం’ కార్యక్రమంలో విద్యార్థులతో మంత్రి లోకేశ్‌

  • త్యాగధనుల జీవితాలను చదవాలి: చాగంటి

కాకినాడ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మి విద్యాశాఖను ఎంచుకున్నానని తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన ‘భారతీయం’ దేశభక్తి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గడిచిన రెండేళ్లలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చామన్నారు. ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వివరించారు. ఇంటర్‌లో కూడా పదివేల అడ్మిషన్లు పెరిగాయని వివరించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ బడుల్లో చదివి, ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థుల ఫొటోలతో పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. నైతిక విలువలే కుటుంబ వ్యవస్థకు పునాది అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఏపీ విద్యావ్యవస్థ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఎదుగుతుందని ఆకాంక్షించారు. లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే..


‘బాపట్లలో జరిగిన మొదటి పీటీఎంలో పిల్లలకు పెట్టే భోజనమే సీఎం చంద్రబాబు కూడా తిన్నారు. నాణ్యత పెంచాలని చెప్పారు. సమాజంలో మార్పు క్లాస్‌రూం నుంచే ప్రారంభమవుతుంది. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు విధ్వంసానికి దారితీస్తాయి. ఇటీవల రంపచోడవరంలో మెగా పేరెంట్స్‌ మీటింగ్‌ జరిగింది. సీఎం హాజరైన ఆ కార్యక్రమంలో శివానీ అనే పదో తరగతి విద్యార్థిని చాలా బాగా మాట్లాడింది. తర్వాత రెండు రోజులకే ఏదో సమస్యతో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధ కలిగించింది. దేవుడు అందరికీ పరీక్ష పెడతాడు. దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఇస్తాడు. మార్కులు తక్కువ వచ్చాయని, చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం సరికాదు. నమ్మిన సిద్ధాంతాలు సాధించే వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నేను అమెరికా స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదివాను. రెండేళ్ల ఎంబీఏ పరీక్షల్లో ఎప్పుడూ ఇన్విజిలేటర్లను చూడలేదు. అలాంటి క్రమశిక్షణ ఇక్కడా రావాలి. నేను ఈ స్థాయికి చేరడం వెనుక నా తల్లి కష్టం, త్యాగం ఉన్నాయి.

గెలుపోటములను సమానంగా తీసుకోవాలి

నైతిక విలువలు అనగానే గుర్తొచ్చే మొదటి పేరు చాగంటి కోటేశ్వరరావు. అందుకే ఆయనను నైతిక విలువల సలహాదారుగా సీఎం నియమించారు. ఆయన రూపొందించిన పుస్తకాలు విద్యార్థులకు అందిస్తున్నాం. చిన్నతనం నుంచే పెద్దలను, మహిళలను గౌరవించడం నేర్పిస్తున్నాం. గెలుపు, ఓటమి రెండింటినీ సమానంగా తీసుకునేలా విద్యార్థులను తయారుచేయడమే లక్ష్యం. చాగంటి ప్రవచనం వినపడని ఇల్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. చాగంటిని ఎప్పుడు కలిసినా ఒక పాజిటివ్‌ ఎనర్జీ వస్తుంది. ‘భారతీయం’ అనే గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయనకు ధన్యవాదాలు. అమ్మకు చెప్పలేని పని చేయొద్దు అని చాగంటి చెప్పిన మాట బాగా గుర్తుండిపోయింది. నేను ఎక్కడికి వెళ్లినా ఇదే చెబుతున్నాను. వినడానికి సింపుల్‌గా ఉంది. కానీ అర్థం చేసుకుంటే చాలా పవర్‌ఫుల్‌ మెసేజ్‌ ఉంది. ఇదే మన భారతీయం. అమ్మ గొప్పతనం. ఎప్పుడూ తప్పు చేయకూడదనే గొప్ప పాఠం.


అందరూ విద్యాశాఖ వద్దన్నారు

అధికారంలోకి వచ్చిన కొత్తలో అందరూ వద్దన్నా విద్యాశాఖను సవాల్‌గా తీసుకున్నా. పట్టుదలగా పనిచేస్తున్నా. విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, బూట్ల విషయంలో రాజకీయాలు ఉండకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే వేటిపైనా ముఖ్యమంత్రితో పాటు నా ఫొటో కూడా ముద్రించలేదు. విజయానికి ఎప్పుడూ అడ్డదారులు ఉండవు. కష్టపడి పనిచేస్తేనే ఉన్నత స్థానానికి వెళ్తాం అనేదానికి నేనే ఉదాహరణ. ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. 2019 ఎన్నికల్లో తొలిసారి ఫెయిలైనా నిరుత్సాహపడలేదు. అయిదేళ్లు కష్టపడి ప్రజలకు దగ్గరయ్యాను. 2024లో రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద మెజారిటీతో గెలిచాను. చాలామంది మంగళగిరి టీడీపీ సీటు కాదు. టీడీపీకి కంచుకోటలాంటి సీట్లకు వెళ్లండి అని సలహా ఇచ్చారు. కానీ పడిన చోటనే నిలబడతా అని చాలెంజ్‌ చేసి గెలిచి చూపించా.

లోకేశ్‌ రావడం విద్యార్థుల అదృష్టం

‘పిల్లల్లో దేశభక్తి నైతిక విలువలు, చరిత్ర పట్ల గౌరవం పెంపొందించాలనే ఉద్దేశంతో ‘భారతీయం’ కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచనను మంత్రి లోకేశ్‌ ఇంటికి వెళ్లి చెప్పగానే ఆయన వెంటనే స్పందించారు. ఈ కార్యక్రమానికి తాను స్వయంగా వస్తానని చెప్పారు. ఆయనతో మాట్లాడి తిరిగి వెళ్తున్నప్పుడు నా కారు వద్దకు వచ్చి పెద్దాయన జాగ్రత్త అని డ్రైవర్‌కు చెప్పారు. చెప్పిన సమయం కంటే ముందే కార్యక్రమానికి రావడం దేశం, చరిత్ర పట్ల లోకేశ్‌ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇటువంటి దేశభక్తి ఉన్న లోకేశ్‌ విద్యాశాఖ మంత్రిగా ఉండటం విద్యార్థుల అదృష్టం’ అని చాగంటి అభినందించారు.


తల్లిదండ్రులు తలదించుకునేలా చేయొద్దు

తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లలను చదివిస్తున్నారు. వారు తలదించుకునేలా ఎప్పుడూ ప్రవర్తించవద్దు. వారు తల ఎత్తుకునేలా చేయండి. మీకు నచ్చిన రంగంలో ఎదగండి. ఆటలు, పాటలు, చదువు ఏదైనా కష్టపడండి. దేశభక్తి, దైవభక్తి. పెద్దలంటే గౌరవం, సమాజం పట్ల బాధ్యత, మహిళలను గౌరవించడం, ఇవన్నీ ఉంటే మీరు విజేతలవుతారు. తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో దేశాన్ని కూడా అంత ప్రేమించాలి’’ అని విద్యార్థులకు లోకేశ్‌ సూచించారు.

త్యాగధనుల జీవితాలను చదవాలి: చాగంటి

దేశ స్వాతంత్య్ర సంగామ్రం గత చరిత్ర కాదని, అది భారతీయుల వారసత్వ సంపద అని ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. దేశం కోసం త్యాగం చేసిన త్యాగధనుల జీవితాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ఎందరో మహనీయులు, తమ జీవితాలను త్యాగం చేసి మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అందించారు. ఆ సంపదను అనుభవించడమే కాదు. దాని విలువను తెలుసుకుని కాపాడుకోవడం మన బాధ్యత. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలోనే ‘భారతీయం’ అనే మాట పుట్టింది. సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. సైమన్‌ గో బ్యాక్‌ అంటూ ప్రజలు ఉద్యమించారు. ‘భారతీయం’ లేని సైమన్‌ మాకు వద్దు అని నిరసనలు తెలిపారు. అండమాన్‌లోని కాలాపాని జైలు గురించి చదివితే స్వాతంత్య్ర సమరయోధుల కష్టాలు మనసును కదిలిస్తాయి.

ఇరుకైన గదులు, ఒంటరితనం, శారీరక హింస, అయినా వారి సంకల్పం మాత్రం చెదరలేదు. గాంధీజీ, నెహ్రూ, లాలా లజపతిరాయ్‌, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి అనేకమంది మహనీయుల జీవితాలను చదివితే స్వాతంత్య్రం ఎంతటి త్యాగాల ఫలితమో అర్థమవుతుంది. మనకు దేవాలయాలు ఎంత పవిత్రమో, స్వాతంత్య్ర సమరయోధులు జీవించిన జైళ్లు, స్మారకాలు, పోరాట ప్రదేశాలు కూడా అంతే ముఖ్యమైనవి. చరిత్ర అర్థమైనప్పుడు దేశభక్తి బలపడుతుంది. పిల్లలకు అలాంటి పుస్తకాలు బహుమతిగా ఇవ్వాలి. స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలను చదివించాలి’ అని చాగంటి సూచించారు.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 03:48 AM