ఏపీఎండీసీ ఐపీవోకు ఓకే
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:33 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధిలో ఓ కొత్త అధ్యాయం. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) షేర్‌మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది.
షేర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్న ప్రభుత్వరంగ సంస్థ.. సీఎం ఆమోదం
త్వరలో క్యాబినెట్ ముందుకు.. రేర్‌ఎర్త్ మినరల్ కార్పొరేషన్ ఏర్పాటుకు రెడీ
బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనేందుకు సిద్ధం.. గనుల సమీక్షలో కీలక నిర్ణయాలు
అమరావతి, నవంబరు 20(ఆంధ్ర జ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధిలో ఓ కొత్త అధ్యాయం. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) షేర్‌మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ సంస్థ ఐపీఓకు వెళ్లేందుకు గనుల శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గనులశాఖ ప్రాజెక్టులపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీఎండీసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న గనుల శాఖ ప్రతిపాదనపై చర్చ జరిగింది. ప్రస్తుతం ఖనిజాభివృద్ధి పరిధిలో ఉన్న అన్ని రకాల ఖనిజ వనరుల విలువ రూ. 7.8 లక్షల కోట్లు ఉంటుందని గనులశాఖ అంచనావేస్తోంది. ఐపీఓకు ఎండీసీ వెళ్తే ఈక్విటీ విలువ కనీసం రూ. 86,290 కోట్లుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ గణాంకాలను పరిశీలించిన అనంతరం ఐపీఓకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. త్వరలో ఇదే అంశంపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఐపీఓపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి
రేర్‌ఎర్త్ ఖనిజాల నిర్వహణ కార్పొరేషన్‌కు
భవిష్యత్‌లో చేపట్టే వ్యాపారాలు, కొత్త ప్రాజెక్టుల అభివృద్ధిపై ఏపీఎండీసీ మరింతగా పోకస్ పెట్టనుంది. ప్రభుత్వం ప్రాధాన్యరంగంగా భావిస్తున్న అరుదైన ఖనిజాల మైనింగ్, నిర్వహణ విషయంలో తమపై భారం తగ్గించాలనుకుంటోంది. అరుదైన ఖనిజాల మైనింగ్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం గనుల శాఖ కొత్తగా రేర్ ఎర్త్ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్‌ఈడీసీ)ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
లిథియం, కోబాల్ట్, నికెల్, ఇతర అరుదైన ఖనిజాల నిర్వహణ ఈ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఏపీఎండీసీ ఐపీఓకు వెళ్తే, అరుదైన ఖనిజాల నిర్వహణ బాధ్యతలు ఈ కార్పొరేషన్ చూసుకుంటుందని గనుల శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపైనా నిర్ణయం తీసుకోనున్నారు.
జెన్‌కో పాటు బొగ్గు బ్లాకుల వేలానికి
ఇతర రాష్ట్రాల పరిధిలో కేంద్రం నిర్వహించే బొగ్గు బ్లాక్‌ల వేలంలో ఏపీఎండీసీ పాల్గొననుంది. ఈ మేరకు ఆ కార్పొరేషన్‌కు ఆర్థిక దన్నుగా ఉండేందుకు రూ. 1,126 కోట్ల బ్యాంక్ గ్యారంటీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే మూడు బొగ్గు బ్లాక్‌ల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటుందని ముఖ్యమంత్రి దృష్టికి గనుల శాఖ తీసుకొచ్చింది. వేలం జరిగే మూడు బ్లాక్‌ల్లో కలిపి 1,746 మిలియన్ టన్నుల బొగ్గు ఉంటుందని అధికారులు సీఎంకు నివేదించారు.
ఏపీ జెన్‌కోతో పాటుగా బొగ్గు బ్లాకుల వేలంలో ఎండీసీ పాల్గొనే అవకాశం ఉంది. ఒడిశాలో మీనాక్షీ సెంట్రల్ (8.25 చదరపు కి.మీ.), నుగోన్ తెలిసాహీ (15.49 చదరపు కి.మీ.), జార్ఖండ్‌లో పాటల్ ఈస్ట్ (8.62 చదరపు కి.మీ.) బ్లాక్‌ల వేలంలో కార్పొరేషన్ పాల్గొంటోంది. ఏపీ జెన్‌కో, ఎండీసీ బొగ్గు బ్లాక్‌లను దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అధికారులు సీఎంకు వివరించారు.
రెన్యూవల్స్ గడువు పొడిగింపు
గనుల శాఖ వద్ద 6,500 క్వారీ లీజుల దరఖాస్తులు, మరో 223 లీజుల రెన్యూవల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ని పరిష్కరించేందుకు గడువును పొడిగించాలన్న గనుల శాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. క్వారీ లీజుల దరఖాస్తుల పరిష్కారం, రెన్యూవల్స్ గడువు పొడిగించడం వల్ల ప్రభుత్వానికి మరో రూ. 400 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని గనుల శాఖ నివేదించింది.
ఎర్రచందనం వేలంపై అసంతృప్తి
అరుదైన ఖనిజాల మైనింగ్‌పై చర్చ సందర్భంగా ఎర్రచందనం వేలం తీరుపై సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక దశలో టన్నుకు రూ. 1.30 కోట్ల మేర ధర వచ్చిందని, వినియోగించుకోలేకపోయారని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎర్రచందనం మార్కెట్‌పై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించినట్లు తెలిసింది. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, గనులశాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, ఆ శాఖ డైరెక్టర్ డబ్ల్యూబీసీ చంద్రశేఖర్, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి