కొలువుదీరిన పుర పాలకులు
ABN , Publish Date - Nov 24 , 2026 | 02:31 AM
రాష్ట్రవ్యాప్తంగా నగరపాలకసంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తాజాగా ఎన్నికల్లో గెలుపొందిన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణం
తండ్రి మరణంతో విశాఖ మేయర్ ప్రమాణం వాయిదా
పలు మున్సిపాలిటీల్లో వైస్‌చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా
ఆత్మకూరు వైస్‌చైర్మన్ ఎన్నికపై జనసేనలో విభేదాలు
అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థిని కాదని మరొకరి ఎంపికతో గొడవ
పిఠాపురం వైస్‌చైర్మన్ ఎన్నికలోనూ వివాదం
మార్కాపురంలో జనసేన కార్యాలయం ఎదుట నిరసన
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రవ్యాప్తంగా నగరపాలకసంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తాజాగా ఎన్నికల్లో గెలుపొందిన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి తండ్రి ముత్యాలనాయుడు ఇటీవల మృతిచెందడంతో ఆమె ప్రమాణస్వీకారం వాయిదా పడింది. 49వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన ఆమె సోదరి పొట్నూరు నీలవేణి కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. మిగిలిన 119 మంది కార్పొరేటర్లతో కలెక్టర్ అభిషిక్త్ ఒకేసారి ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ మేయర్‌గా 37వ డివిజన్ కార్పొరేటర్ పీవీ శివప్రసాద్(జనసేన) ఎన్నికయ్యారు. కడప నగరపాలక సంస్థ తొలి మహిళా మేయరుగా మట్లి సువర్ణ ప్రమాణ స్వీకారం చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో వైస్‌చైర్మన్ ఎన్నిక వివాదాస్పదం కావడంతో మంగళవారానికి వాయిదా పడింది. కూటమి ఒప్పందంలో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అధిష్ఠానం 11వ వార్డు కౌన్సిలర్ కొలగ శిరీషను వైస్‌చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆమెను కాదని అదేపార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ కత్తి పద్మజను వైస్‌చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టారు. దీంతో బీఫారం పొందిన శిరీష మున్సిపల్ సమావేశంలోనే ఎన్నికల అధికారిని, మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని నిలదీశారు. ఆమె వాదనను ఎవరూ పట్టించుకోకపోగా, మహిళా పోలీసులు శిరీషను వెలుపలికి తీసుకెళ్లారు. దీంతో శిరీష మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పార్టీకి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో వైస్‌చైర్మన్ ఎన్నికలో తప్పిదం జరిగిందని గుర్తించిన అధికారులు వైస్‌చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
మార్కాపురం మునిసిపల్ వైస్‌చైర్మన్ పదవి పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు కేటాయించారు. వైస్‌చైర్మన్ పదవికి కొప్పుల నాగజ్యోతి పేరు ప్రకటించారు. ఆమెను వైస్‌చైర్‌పర్సన్‌గా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎన్నిక సందర్భంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన అధికారికంగా ప్రకటించిన బొజ్జా వెంకటేశ్వరరావు(దొరబాబు)కు ఆరుగురు సభ్యులు మాత్రమే మద్దతు తెలిపారు. ఈ దశలో పిండి సంధ్య పేరును జనసేన కౌన్సిలర్ రెడ్డెం రామారావు(రమేష్) ప్రతిపాదించారు. బొజ్జా వెంకటేశ్వరరావు, రెడ్డెం రమేష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎన్నికల తర్వాత వచ్చిన వ్యక్తికి వైస్‌చైర్మన్ పదవి ఎలా ఇస్తారని రమేష్ ప్రశ్నించారు. చివరికి బొజ్జా వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ఎంపీ ఉదయశ్రీనివాస్ అనుచరుడు వీరంరెడ్డి చక్రిపై జనసేనలోని ఒక వర్గం నాయకులు దాడి చేసి తరిమికొట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
వైస్‌చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మునిసిపల్ వైస్ చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నాయకుడు టంకాల రవిశంకర్ గుప్తాను ఎన్నికల సమయంలోనే ప్రకటించారు. అయితే, అనూహ్యంగా వైస్‌చైర్మన్ సీటుగా వాడరేవు అశోక్ పేరును జనసేన ప్రకటించింది. దీన్ని టీడీపీ అధిష్ఠానం కూడా ఖరారు చేసింది. అయితే, ప్రమాణస్వీకారం అనంతరం కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్లిపోవడంతో వైస్‌చైర్మన్ ఎన్నికను కోరం లేదంటూ మంగళవారానికి వాయిదా వేశారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీలో వైస్‌చైర్మన్ పదవిని పొత్తులో భాగంగా జనసేనకు అద్దేపల్లి సౌజన్యకు కేటాయించారు. అయితే, టీడీపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం అనంతరం బయటికి వెళ్లిపోవడంతో కోరం లేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
అలాగే, మాచర్ల పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఎన్నికనూ మంగళవారానికి వాయిదా వేశారు. జగ్గయ్యపేట మునిసిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని రెండో వార్డు కౌన్సిలర్ రాధాకృష్ణ(టీడీపీ) ఆశించారు. కూటమి సర్ధుబాటులో భాగంగా ఆ పదవి జనసేన కౌన్సిలర్ కొలగాని రాముకు దక్కింది. దీంతో రాధాకృష్ణ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి ఫోన్‌స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నందిగామలో వైస్ చైర్మన్ పదవి తనకే దక్కుతుందని 15వ వార్డు కౌన్సిలర్ ఇమామ్ ఆశపడ్డారు. చివరి క్షణంలో ఆ పదవి బీజేపీ కౌన్సిలర్ పొర్లకొండ సీతారామయ్యకు కేటాయించారు.
దీంతో పట్టణంలోని పలువురు మైనార్టీ టీడీపీ నాయకులు ధర్నా చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ, బీజేపీ విభేదాలతో వైస్‌చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. చిత్తూరు జిల్లా నగరిలో మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవి ఆశించి భంగపడిన లత క్లాక్ కూడలిలో కుటుంబసభ్యులతో బైఠాయించారు. పార్టీ నేతలు నచ్చజెప్పడంతో తర్వాత ప్రమాణస్వీకారం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల ప్రమాణ స్వీకారం మంగళవారానికి వాయిదా పడింది. రాజంపేట మున్సిపాలిటీలో ఏకాభిప్రాయంలేక వైస్‌చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
కౌన్సిలర్‌గా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రమాణం..
తాడిపత్రి మున్సిపాలిటీలో 37వ వార్డు కౌన్సిలర్‌గా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణస్వీకారోత్సవం అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘నేను హిట్లర్ లాంటివాడిని. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రౌడీగా మారి, నియంతలాగా పరిపాలన కొనసాగిస్తున్నాను. తాడిపత్రిని కాపాడుకునేందుకు రౌడీలాగా నిర్ణయాలు తీసుకుంటాను’ అన్నారు. తాడిపత్రి కోసం అందరూ కలిసి పనిచేయాలని, ఇష్టం లేకపోయినా కౌన్సిల్ సమావేశంలో సంతకాలు పెట్టాల్సిందేనని కౌన్సిలర్లనుద్దేశించి అన్నారు.
ఈ వార్తలనూ చదవండి: