ఏపీ స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ బాక్సుల భద్రతపై కీలక మార్గదర్శకాలు
ABN , Publish Date - Oct 21 , 2026 | 05:05 PM
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల భద్రతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
అమరావతి, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల భద్రతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచాలని స్పష్టం చేసింది. స్ట్రాంగ్ రూమ్‌ల తాళాలకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సొంత సీల్స్ వేసుకునే అవకాశం కల్పించింది. భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు డబుల్ లాక్ విధానాన్ని అమలు చేయాలని సూచించింది. రెండు తాళాలను వేర్వేరు అధికారుల వద్ద ఉంచేలా ఏర్పాట్లు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లకు లోపలి వలయంలో రాష్ట్ర సాయుధ పోలీసులు, బయటి వలయంలో సివిల్ పోలీసులతో రెండంచెల భద్రత కల్పించనున్నారు.
బ్యాలెట్ బాక్సుల భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా స్ట్రాంగ్ రూమ్‌ల లోపల, ప్రవేశ ద్వారాల వద్ద, పరిసర ప్రాంతాల్లో 24 గంటల పాటు సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు 100 మీటర్ల పరిధిలో సీసీటీవీ ఫుటేజ్‌ను నిరంతరం పర్యవేక్షించేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అభ్యర్థులు, వారి ప్రతినిధులు అక్కడి నుంచి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించుకోవచ్చు. స్ట్రాంగ్ రూమ్‌లను తెరవడం, మూసివేయడం వంటి ప్రక్రియలను అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే వీడియోగ్రఫీ రికార్డింగ్‌తో నిర్వహించాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లను సిద్ధంగా ఉంచాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, బ్యాలెట్ బాక్సుల భద్రతపై విశ్వాసం కల్పించడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం.
ఈ వార్తలనూ చదవండి:
ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్
కశ్మీర్‌లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు