Share News

ఏపీలో మద్యం షాపులపై ప్రభుత్వం కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 23 , 2026 | 09:43 PM

ఏపీ మద్యం షాపుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ4 షాపుల రెన్యువల్‌కు ఇచ్చిన గడువు నేటి అర్ధరాత్రితో ముగియనుండగా.. ఇక ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది.

ఏపీలో మద్యం షాపులపై ప్రభుత్వం కీలక ప్రకటన
A4 Liquor Shops

అమరావతి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో ఏ4 మద్యం షాపుల రెన్యువల్ ప్రక్రియకు ప్రభుత్వం ఇక గడువు పొడిగింపు ఇవ్వనుంది. సెప్టెంబర్ 23 అర్ధరాత్రితో రెన్యువల్ గడువు ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా రెన్యువల్‌కు నోటిఫై చేసిన 3,650 ఏ4 షాపుల్లో ఇప్పటివరకు 3,236 షాపులు రెన్యువల్‌కు ముందుకొచ్చాయి. వీటిలో 2,873 షాపులు రెన్యువల్ RETను పూర్తిగా చెల్లించగా, మరో 33 షాపులు పాక్షికంగా చెల్లింపులు చేశాయి. మొత్తంగా 2,906 షాపులకు పూర్తి లేదా పాక్షిక చెల్లింపులు నమోదయ్యాయి. దీంతో మొత్తం షాపుల్లో 88.7 శాతం రెన్యువల్‌కు దరఖాస్తు చేయగా.. సుమారు 80 శాతం షాపులకు RET చెల్లింపులు పూర్తయ్యాయి. చెల్లింపుల్లో 97.1 శాతంతో తూర్పుగోదావరి జిల్లా ముందంజలో ఉండగా, అల్లూరి సీతారామరాజు 94.7, శ్రీ సత్యసాయి 91.8, కోనసీమ 91.1, ఏలూరు 91 శాతం చెల్లింపులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


సెప్టెంబర్ 23 అర్ధరాత్రిలోగా 100 శాతం రెన్యువల్ RET చెల్లించిన షాపులకే రెన్యువల్ వర్తించనుంది. పూర్తిగా RET చెల్లించిన షాపులను సెప్టెంబర్ 24న విడుదల చేయనున్న తాజా గెజిట్ నోటిఫికేషన్‌లో చేర్చరు. వార్షిక RET, పర్మిట్ రూమ్ RET చెల్లింపులకు మరో రెండు రోజుల అవకాశం కల్పించనున్నారు. ఇదిలా ఉండగా రెన్యువల్ కాని, ఇప్పటివరకు నోటిఫై కాని ఏ4 షాపులకు కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. సెప్టెంబర్ 24న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 2న దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, అక్టోబర్ 3న లాటరీ ద్వారా కొత్త ఏ4 షాపులను కేటాయించనున్నారు.


ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 23 , 2026 | 09:57 PM