వైసీపీలో ‘లిక్కర్’ టెన్షన్
ABN , Publish Date - Sep 21 , 2026 | 03:30 AM
జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విచారణలో ఎన్నో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్కామ్‌లోనే.. మరెన్నో స్కామ్‌లు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని అడ్డగోలుగా దోచుకున్న వైనం దర్యాప్తు అధికారులనే విస్తుపోయేలా చేస్తోంది.
నిండా మునిగిన వైసీపీ అధినేత
సిట్‌తో పాటు ఈడీ విచారణలోమూలాలన్నీ మాజీ సీఎం వైపే
జగన్ ఇంట్లోనే స్కామ్‌కు స్కెచ్ వేశారని నాటి అధికారి సత్యప్రసాద్ వాంగ్మూలం
ఆయన మానసిక స్థితి బాగోలేదంటూ వైసీపీ ప్రచారం
పదేళ్లుగా ట్రీట్‌మెంట్ అంటూ కలరింగ్
మరి నాడు ఎందుకు నియమించారో?
(అమరావతి-ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విచారణలో ఎన్నో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్కామ్‌లోనే.. మరెన్నో స్కామ్‌లు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని అడ్డగోలుగా దోచుకున్న వైనం దర్యాప్తు అధికారులనే విస్తుపోయేలా చేస్తోంది. మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)తో పాటు తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో కూడా మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నట్టు తేలుతోంది. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ తేల్చగా... మాజీ సీఎం జగన్‌కు తెలిసే ఈ కుంభకోణం జరిగిందని తాజాగా ఈడీ విచారణలో తేలింది. నాడు జగన్ దిశానిర్దేశంతోనే ఈ తతంగమంతా జరిగిందని ఏపీఎస్‌బీసీఎల్ ప్రత్యేకాధికారిగా పనిచేసిన దొడ్డా వెంకట సత్యప్రసాద్ ఈడీ విచారణలో చెప్పడంతో వైసీపీ వర్గాల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. లిక్కర్ స్కామ్‌లో జగన్ నిండా మునిగిపోయారన్న అభిప్రాయం ఆయన పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఈ కేసు విచారణలో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? చివరకు ఎటు వెళ్తుందోనన్న ఆందోళన వైసీపీ శిబిరంలోనూ, తాడేపల్లి ప్యాలెస్‌లోనూ మొదలైంది.
ఇదీ జరిగింది...
వైసీపీ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్, కార్పొరేషన్లలో అధికారుల నియామకాలన్నీ అప్పటి సీఎం జగన్ కనుసన్నలలోనే జరిగేవి. అదేవిధంగా ఏపీఎస్‌బీసీఎల్ ప్రత్యేకాధికారిగా దొడ్డా వెంకట సత్యప్రసాద్‌ను నియమించారు. ఆయనకు ఐఏఎస్‌గా పదోన్నతిని కల్పిస్తామంటూ జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో మద్యం కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను ఆయన పాటిస్తూ వచ్చారు. లిక్కర్ స్కామ్ బయటకు వచ్చాక సత్యప్రసాద్‌ను సిట్ విచారించింది. లిక్కర్ రవాణాలోనూ భారీ అక్రమాలు జరిగాయని సిట్ దర్యాప్తులో బయటపడింది. ఈ అక్రమాలపై ఆరా తీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం రంగంలోకి దిగింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను అరెస్టు చేసింది. ఈ మధ్యనే కారుమూరి నాగేశ్వరరావునూ ఈడీ అరెస్టు చేసింది. ఈడీ దర్యాప్తులో లిక్కర్ స్కామ్ పాత్రదారులతో పాటు సూత్రధారులపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే సత్యప్రసాద్‌ను విచారించింది. అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్ అంతా జగన్ కనుసన్నలలోనే లిక్కర్ కుంభకోణం జరిగిందని వెల్లడించారు. స్కెచ్ అంతా తాడేపల్లి నివాసంలోనే అమలైందని ఈడీ ముందు సాక్ష్యమిచ్చారు.
మతిస్థితిమితం లేని వ్యక్తిగా ముద్ర
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీఎస్‌బీసీఎల్ ప్రత్యేక అధికారిగా సత్యప్రసాద్ మద్యం క్రయవిక్రయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన్ను ఏపీఎస్‌బీసీఎల్ ప్రత్యేకాధికారిగా నియమించినప్పుడు గాని.. ఐఏఎస్ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినప్పుడుగాని ఆయన తాము చెప్పినట్టు చేస్తారనే దగ్గరకు తీసుకున్నారు. ఐఏఎస్ హోదా ఇస్తామనడంతో నమ్మిన సత్యప్రసాద్ ఏపీఎస్‌బీసీఎల్ వ్యవహారాలను జగన్ చెప్పినట్లుగా అమలు చేశారు. ఇప్పుడు ఆయన అప్రూవర్‌గా మారి మద్యం కుంభకోణంలో నిజాలు చెప్పేసరికి మతిస్థిమితం లేని వ్యకిగా వైసీపీ నేతలు ముద్ర వేస్తున్నారు. సత్యప్రసాద్‌కు మతిస్థిమితం లేదని, పదేళ్లుగా మందులు వాడుతున్నారని జగన్ వర్గం ఆరోపణలు చేయడం మొదలెట్టింది. పదేళ్లుగా మందులు వాడుతుంటే ఏపీఎస్‌బీసీఎల్‌లో ప్రధానమైన బాధ్యతలను జగన్ ఎలా అప్పగించారన్న ప్రశ్నలకు వైసీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు.
జనం ఆరోగ్యంతో ఆటలు
జగన్ హయాంలో జనం ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నాణ్యతలేని చీప్ లిక్కర్‌ను విక్రయించారు. ఈ విమర్శలను జగన్ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. జంగారెడ్డిగూడెంలో నాణ్యతలేని మద్యం తాగిన మరణించినా .. అవి సహజ మరణాలుగానే జగన్ ప్రభుత్వం ప్రకటించింది. నాణ్యత లేని మద్యం తాగి ఎంతో మంది ఆరోగ్యం దెబ్బతింది. నాణ్యత లేని మద్యాన్ని స్థానికంగా తయారు చేసి, అధికారిక లెక్కల్లో చూపకుండా జగన్ సర్కారు విక్రయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూరగాయల అంగడిలోనూ యూపీఐ లావాదేవీలు జరుగుతుంటే.. నాడు రాష్ట్రంలోని లిక్కర్‌షాపుల్లో మాత్రం నగదు లావాదేవీలే జరిగాయి. ఎక్కడా డిజిటల్ పేమెంట్లు జరగలేదు. ఇదంతా స్కామ్‌లో భాగమేనని సిట్, ఈడీ తమ దర్యాప్తులో పేర్కొన్నాయి. ఈ నగదు లావాదేవీల వల్ల మద్యం అమ్మకాలపై లెక్కా పత్రాలు లేవు.
స్కామ్‌ల మీద స్కామ్‌లు
కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ బయపడింది. ఆ తర్వాత ఇదే స్కామ్‌లో మద్యం రవాణా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మద్యం టెండర్లలో సరఫరా కాంట్రాక్టు ధరలను భారీగా పెంచేసి దాదాపు 190 కోట్లు దోచుకున్నట్టు సిట్ విచారణలో గుర్తించారు. అంతేగాక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది సొమ్మునూ దాదాపు 400 కోట్లు దోచుకున్నట్టు తాజాగా మరో స్కామ్ బయటపడింది. మద్యం దుకాణాల్లో 9 వేలమందిని నియమించి, అదనంగా 3 వేలమంది పనిచేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకున్నారు. అంతేగాక చిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే తక్కువ జీతాలు ఇచ్చి వారి సొమ్మును మింగేశారు. పెద్దిరెడ్డి అనుచరుడు, రాయచోటికి చెందిన వ్యక్తి యజమానిగా ఉన్న ‘రెడ్డి అండ్ రెడ్డి’ ఏజెన్సీ ద్వారా ఈ స్కామ్ చేశారు. ఈ సొమ్ములో సింహభాగం ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అందుకున్నట్టు తెలుస్తోంది. ఇలా వరుస స్కామ్‌లు బయటపడుతుండటంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి..