నలుగురికి షోకాజ్
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:43 AM
భీమిలి పట్టణం గొల్లలపాలెం కస్తూర్బా బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో తొమ్మిదోతరగతి చదువుతున్న పది మంది బాలికల జుత్తు కత్తిరింపు వ్యవహారాన్ని సమగ్ర శిక్ష అధికారులు తీవ్రంగా పరిగణించారు.
భీమిలి కేజీబీవీలో బాలికల జుత్తు కత్తిరింపు ఘటనపై అధికారుల చర్యలు
బాలికలకు కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ప్రయత్నాలు
విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
భీమిలి పట్టణం గొల్లలపాలెం కస్తూర్బా బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో తొమ్మిదోతరగతి చదువుతున్న పది మంది బాలికల జుత్తు కత్తిరింపు వ్యవహారాన్ని సమగ్ర శిక్ష అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఘటనకు బాధ్యులుగా కేజీబీవీ ప్రిన్సిపాల్ గంగాకుమారి, ఘటన జరిగిన రోజు అంటే ఈనెల 16వ తేదీ రాత్రి విధులు నిర్వహించిన ఇద్దరు టీచర్లు, నైట్‌వాచ్ ఉమన్‌కు షోకాజ్ నోటీసులు జారీచేశారు. తగిన వివరణ ఇవ్వాలని షోకాజ్‌లో సమగ్ర ఏపీసీ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
విద్యాలయం చుట్టూ ఎత్తైన ప్రహరీ, ప్రధాన ద్వారం నుంచి భవనం చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఘటన జరిగిన రోజు రాత్రి సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. ఆ సమయంలో బయటి నుంచి ఎవరూ లోపలకు రాలేదని గుర్తించారు. భవనం లోపలకు వెళ్లే దారిలో గేటుకు, పిల్లలు నిద్రించే డార్మిటరీ గేటుకు తాళాలు వేస్తారు. బయట నుంచి ఎవరైనా వస్తే రెండు గేట తాళాలు విరగ్గొట్టాలి. అలాంటి ఘటన జరగలేదని చెబుతున్నారు. విద్యాలయంలో బాలికలకు క్రాఫ్ట్, డ్రాయింగ్ వర్క్ కోసం వినియోగించే కత్తెరనే జుత్తు కత్తిరించేందుకు వాడారని గుర్తించినట్టు సమాచారం. ఘటనలో విద్యాలయంలోని బాలికల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పిల్లలందరినీ విచారిస్తే భయపడే అవకాశం ఉందని గుర్తించి వ్యవహారాన్ని సున్నితంగా పరిష్కరించాలని యోచించారు. ఈ నేపథ్యంలో పిల్లలను మానసిక ఒత్తిడి నుంచి దూరంచేయడానికి ఇద్దరు మహిళా కౌన్సెలర్లతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. చదువులో ఒత్తిడి తగ్గించడం, తోటి పిల్లల మధ్య స్నేహభావం పెంపొదించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.