చిన్నారుల్లో న్యుమోనియా మరణాలు తగ్గిస్తాం
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:12 AM
ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ‘సాన్స్ 2026-27’ (సోషల్ ఎవేర్‌నెస్, యాక్షన్ టు న్యూట్రలైజ్ న్యుమోనియా సక్సె్‌సఫుల్లీ) ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని...
వ్యాధి గుర్తింపు, సకాలంలో వైద్యం అందేలా ఏర్పాట్లు
నేడు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ‘సాన్స్’ ప్రారంభం
ఆరోగ్య శాఖ కమిషనర్ చక్రధర్‌బాబు వెల్లడి
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ‘సాన్స్ 2026-27’ (సోషల్ ఎవేర్‌నెస్, యాక్షన్ టు న్యూట్రలైజ్ న్యుమోనియా సక్సెస్‌ఫుల్లీ) ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఆరోగ్యశాఖ కమిషనర్ కేవీఎన్ చక్రధర్‌బాబు బుధవారం తెలిపారు. గురువారం మొదలయ్యే ఈ కార్యక్రమం 2027 ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 17.2 శాతం మరణాలు న్యుమోనియా కారణంగానే సంభవిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు న్యుమోనియా గుర్తింపు, చికిత్సపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చిన్నారుల్లో వ్యాధి లక్షణాలను గుర్తించి, బాధితులకు తక్షణ వైద్య సేవలందేలా చూస్తారని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో విజయవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
గుండెపోటు, పక్షవాతానికి సకాలంలో వైద్యం
గుండెపోటు, పక్షవాతం బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులను సమర్థంగా నియంత్రించాలని చక్రధర్‌బాబు అధికారులకు సూచించారు. గుండెపోటు ఇతర అసంక్రమిత వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ మంగళగిరిలో రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో వ్యాధులను ముందుగానే గుర్తించడం, సమగ్ర చికిత్స అందించడంపై అధికారులు, వైద్యులకు శిక్షణ ఇచ్చినట్టు చక్రధర్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ విష్ణువర్థన్, డీహెచ్ వెంకటరమణ పాల్గొన్నారు.
నవజాత శిశువుల కోసం పోర్టల్..
నవజాత శిశువులకు అందించే వైద్యసేవల నాణ్యతను పెంచి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆరోగ్యశాఖ ఎఫ్‌బీఎన్‌సీ (ఆసుపత్రి ఆధారిత నవజాత శిశు సంరక్షణ) పోర్టల్‌ను బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో చినకాకాని హాయ్‌లాండ్ హోటల్‌లో రెండు రోజుల పాటు పోర్టల్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను పోర్టల్‌లో సకాలంలో నమోదు, విశ్లేషణ, పర్యవేక్షణలో వైద్య సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ లక్ష్యమని చక్రధర్‌బాబు వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు