Share News

సముద్ర వాణిజ్య హబ్‌గా ఏపీ

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:19 AM

భారతదేశం మారిటైమ్‌ ఎకానమీ.. సముద్ర ఆధారంగా జరిగే వాణిజ్యం, రవాణా, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు.

సముద్ర వాణిజ్య హబ్‌గా ఏపీ

  • మారిటైమ్‌ ఎకానమీకి ప్రాధాన్యం: లోకేశ్‌

  • పారిశ్రామిక గేట్‌వేగా అభివృద్ధికి యత్నాలు

  • సముద్ర అనుసంధానం, నైపుణ్యాభివృద్ధికి ఆగ్నేయాసియా దేశాలతో కలిసి పనిచేస్తాం

  • హరిత ఇంధన రంగంలో కూడా..

  • డిజిటల్‌ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ

  • గూగుల్‌ సంస్థ ఏఐ డేటా సెంటర్‌ నిర్మిస్తోంది

  • సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్లూ వస్తున్నాయ్‌

  • గ్రీన్‌ ఎనర్జీలో రాష్ట్రాన్ని మరో సౌదీగా మారుస్తాం

  • ఆసియాన్‌-ఇండియా సదస్సులో ఐటీ మంత్రి

విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): భారతదేశం మారిటైమ్‌ ఎకానమీ.. సముద్ర ఆధారంగా జరిగే వాణిజ్యం, రవాణా, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాగరమాల, మారిటైమ్‌ ఇండియా విజన్‌, అమృత్‌కాల్‌ విజన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. దేశంలోనే అత్యంత పొడవైన (1053 కి.మీ.) సముద్ర తీరం కలిగిన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వాన రాష్ట్రాన్ని మారిటైమ్‌ హబ్‌గా, పారిశామ్రిక గేట్‌వేగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సోమవారం విశాఖ నోవాటెల్‌ హోటల్‌లో ఇండియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘ఆసియాన్‌-ఇండియా’ మారిటైమ్‌ సదస్సుకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో పాటు లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. సముద్ర అనుసంధానం, టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, హరిత ఇంధన రంగాల్లో ఆగ్నేయాసియా దేశాలతో కలిసి పనిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘గత ఏడాది విశాఖ పోర్టు 91.17 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసింది. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడల్లో కొత్తగా పోర్టుల నిర్మాణం జరుగుతోంది. దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం నెలకొల్పుతున్నాం. ఇటీవల విశాఖ భాగస్వామ్య సదస్సులో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్‌, నౌకల మరమ్మతులకు సంబంధించి రూ.7,500 కోట్ల విలువైన అవగాహనా ఒప్పందాలు చేసుకున్నాం.


పోర్టులకు పరిశ్రమలతో, పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం’ అని స్పష్టంచేశారు. విశాఖను డిజిటల్‌ కనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గూగుల్‌ సంస్థ ఇక్కడ 15 బిలియన్‌ డాలర్ల భారీపెట్టుబడితో గిగావాట్‌ సామర్థ్యం కలిగిన ఏఐ డేటా సెంటర్‌ నిర్మిస్తోందని తెలిపారు. మూడు సంస్థలు విశాఖలో ఇంటర్నేషనల్‌ సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని.. రుషికొండలో ఇప్పటికే ఒక సెంటర్‌కు శంకుస్థాపన జరిగిందని చెప్పారు. ‘గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనూ రాష్ట్రాన్ని మరో సౌదీ అరేబియాగా మారుస్తాం. మాకు సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌ రంగాల్లో అపార సామర్థ్యం ఉంది.

గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియం ఎగుమతుల్లో కీలకంగా ఎదగాలనుకుంటున్నాం, మారిటైమ్‌ రంగంలో 2028 నాటికి ఐదు వేల మందికి సముద్ర రంగ నిపుణులుగా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర మారిటైమ్‌ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. గ్రీన్‌ ఫ్యూయల్స్‌, క్లీన్‌ షిప్పింగ్‌, సస్టెయినబుల్‌ పోర్ట్‌ డెవల్‌పమెంట్‌ రంగాల్లో ఆసియా దేశాలతో భాగస్వామ్యం కోరుకుంటున్నాం. సముద్ర అనుసంధానం, పోర్టు లాజిస్టిక్స్‌ వ్యవస్థల అభివృద్ధి, స్మార్ట్‌ పోర్టులు, ఏఐ, డిజిటల్‌ లాజిస్టిక్స్‌, ఓషన్‌ రోబోటిక్స్‌ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించండి’ అని కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 03:24 AM