‘పే స్కేలు’పై అప్పీలుకు వెళ్దాం
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:21 AM
రాష్ట్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల నిబంధనలపై ఉన్నత విద్యాశాఖ
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. యూజీసీ పేస్కేలు నిబంధనపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అప్పీలుకు వెళ్లాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే ఎనిమిదేళ్లు, ప్రొఫెసర్ పోస్టుకు పదేళ్ల బోధనానుభవం ఉండాలని పేర్కొంది. ఆ కాలంలో యూజీసీ పేస్కేలు ప్రకారం వేతనం పొంది ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన, ప్రైవేటు విద్యాసంస్థల్లో అనేక మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నా వారికి యూజీసీ పేస్కేళ్లు అందడం లేదు. కానీ, ఆ మేరకు వేతనాలు ఇస్తున్నట్లు యూనివర్సిటీలు ధృవీకరించాయి. ఆ ధృవీకరణ సర్టిఫికెట్‌తోపాటు బ్యాంక్ స్టేట్‌మెంట్లు కూడా దరఖాస్తులకు జత చేయాలని ఉన్నత విద్యాశాఖ తెలిపింది.
ఫలితంగా 70 శాతం అభ్యర్థులు అర్హత కోల్పోయారు. ఇదే అంశంపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పేస్కేలు అనేది దరఖాస్తుకు ప్రామాణికం కాకూడదని, బోధనానుభవాన్నే చూడాలని హైకోర్టు చెప్పింది. వారి దరఖాస్తుల స్వీకరణ అంశాన్ని పునఃపరిశీలించాలని ఉన్నత విద్యాశాఖను ఆదేశించింది. అయితే, తాము యూజీసీ నిబంధనలనే అమలు చేస్తున్నామని, యూజీసీ పేస్కేలు లేనివారికి అవకాశం ఇస్తే నిబంధనలను ఉల్లంఘించినట్లుఅవుతుందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్