కోర్టు విచారణల అనధికారిక రికార్డింగ్‌ను సహించం!
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:28 AM
న్యాయస్థానాల్లో జరిగే విచారణలను అనధికారికంగా రికార్డు చేసి దుర్వినియోగం చేసేవారిని ఉపేక్షించేది లేదని హైకోర్టు హెచ్చరించింది.
అలాంటి వారిపై కఠిన చర్యలు: హైకోర్టు
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాల్లో జరిగే విచారణలను అనధికారికంగా రికార్డు చేసి దుర్వినియోగం చేసేవారిని ఉపేక్షించేది లేదని హైకోర్టు హెచ్చరించింది. కోర్టు విచారణలను రికార్డు చేసి, వాటిని వ్యాప్తి చేయడం, తిరిగి ప్రసారం చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిషేధించింది. ప్రత్యేక అనుమతులు పొందిన సందర్భాల్లో మినహా సంబంధిత అధికారి అనుమతి లేకుండా విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలు, స్క్రీన్ షాట్లు, స్క్రీన్ రికార్డింగ్‌లను అనుమతించబోమని స్పష్టం చేసింది.
హైకోర్టు రూపొందించిన వీడియో కాన్ఫరెన్సింగ్ నిబంధనలు, న్యాయస్థానాల్లో విచారణల రికార్డింగ్, వినియోగం, వ్యాప్తికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను న్యాయవాదులు, కక్షిదారులు, మీడియా ప్రతినిధులు, న్యాయస్థాన సిబ్బంది, కోర్టుకు వచ్చే వ్యక్తులు, విచారణలను వీక్షించేవారందరూ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని, అలాంటివారిపై చట్టనిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్(ఐటీ) బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్