Share News

IAS అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం: 'అధికారం ఉంటే సస్పెండ్ చేసేవాళ్లం!'

ABN , Publish Date - Apr 23 , 2026 | 07:27 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు నిప్పులు చెరిగింది. ఉద్యోగుల పట్ల రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగడానికి వీల్లేదంది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులన్నా ఆయనకు గౌరవం లేదని మండిపడింది.

IAS అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం: 'అధికారం ఉంటే సస్పెండ్ చేసేవాళ్లం!'
AP High Court Slams IAS Officer Ahmed Babu

అమరావతి, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు నిప్పులు చెరిగింది. ఉద్యోగుల పట్ల రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగడానికి వీల్లేదని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులన్నా ఆయనకు గౌరవం లేదని న్యాయస్థానం మండిపడింది. బీపీసీ (BPC) నిర్వహించి, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించకుండా ఫైళ్లను తొక్కిపెడతారా? ఇది ఉద్యోగులను వేధించడం కాదా? వారి జీవితాలతో ఆటలాడుతారా? అంటూ ధర్మాసనం నిలదీసింది.

అహ్మద్ బాబుపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఎందుకు మౌనంగా ఉన్నారని కోర్టు ప్రశ్నించింది. ఆయన్ను ఇంకా అదే పోస్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని, ఇటువంటి వారిని తక్షణమే 'లూప్‌లైన్'లో వేయాలని సూచించింది. అహ్మద్ బాబుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని హైకోర్టు హెచ్చరించింది. ఒకవేళ ఆరోపణలు నిజమని ఆధారాలు ఉంటే, ఆయన్ను సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని కూడా ఆదేశిస్తామని స్పష్టం చేసింది.


సీఎస్ నివేదిక కోరిన ధర్మాసనం

అహ్మద్ బాబు వ్యవహారంపై బాధితుడు/పిటిషనర్ ఇచ్చిన వినతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమిటో తమ ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్ (AG)ను కోర్టు ఆదేశించింది. ఒకవేళ మాకు అధికారం ఉంటే ఇప్పుడే అహ్మద్ బాబును సస్పెండ్ చేసేవాళ్లమని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఉన్నత స్థాయి అధికారిపై న్యాయస్థానం ఇంత కఠినంగా స్పందించడం ఇప్పుడు ఏపీ అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


ఇవి కూడా చదవండి...

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2026 | 08:04 PM