Share News

అమరావతి ఓఆర్‌ఆర్‌ టెండర్లు తెరవకుండా ఆపడానికి నో

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:46 AM

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.

అమరావతి ఓఆర్‌ఆర్‌ టెండర్లు తెరవకుండా ఆపడానికి నో

  • లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఎన్‌హెచ్‌ఏఐకి హైకోర్టు ఆదేశం

  • అలైన్‌మెంట్‌ విషయంలో దాఖలైన పిల్‌పై ముగిసిన వాదనలు

  • విచారణ వారం రోజులకు వాయిదా

అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్‌పై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు విచారణను వారం రోజులకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం (19న) టెండర్లు తెరవకుండా నిలువరించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి సంబంధించి విజయవాడ సౌత్‌ ఈస్ట్‌(ఆగ్నేయం), నార్త్‌ ఈస్ట్‌(ఈశాన్యం) పరిధిలోని అలైన్‌మెంట్‌ను సవాల్‌ చేస్తూ కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన రైతు కె.ఆంజనేయ ప్రసాద్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది టి.శ్రీధర్‌ వాదనలు వినిపిస్తూ.. అమరావతిని కాకుండా విజయవాడను కేంద్రంగా ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ రూపొందించారని అన్నారు.

కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించారని.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించకుండా.. అడ్మినిస్ట్రేటివ్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం లేకుండా.. పరిపాలనాపరమైన అనుమతులు కూడా లేకుండా టెండర్లు పిలిచారని తెలిపారు. 19న టెండర్లు ఓపెన్‌ చేయబోతున్నారని, దానిని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.


రింగ్‌ రోడ్డు ఎటు వెళ్లాలో పిటిషనర్‌ నిర్దేశించలేరు

ఎన్‌హెచ్‌ఏఐ తరఫు న్యాయవాది తాండవ యోగేశ్‌ స్పందిస్తూ.. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని.. ఇందులో భాగంగా అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. భవిష్యత్‌ అవసరాలు, అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఓఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ ఖరారు చేసినట్లు చెప్పారు. అలైన్‌మెంట్‌ ద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అధికార పార్టీ నేతలు లబ్ధి పొందుతున్నారని పిటిషనర్‌ ఆరోపించారు తప్ప ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదన్నారు.

రింగ్‌ రోడ్డు ఏయే ప్రాంతాల నుంచి వెళ్లాలో ఆయన నిర్దేశించలేరని తెలిపారు. అనధికారిక లేఅవుట్లకు నష్టం జరగకుండా చూసేందుకే ఈ పిల్‌ వేసినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఏ ప్రాజెక్టయినా ముందుగా అలైన్‌మెంట్‌ ఖరారు చేస్తారని.. డీపీఆర్‌ పూర్తయ్యాకే ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని పిటిషనర్‌ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ప్రాజెక్టు పురోగతి ఆధారంగా వివిధ దశల్లో డీపీఆర్‌ రూపుదిద్దుకుంటుందన్నారు.

అన్ని అనుమతులతోనే పనులు చేపట్టామన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.30వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. భూ సేకరణకు ప్రస్తుతం అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని.. మొత్తం 5 జిల్లాల్లో 1310 మంది భూయజమానులు అభ్యంతరాలు లేవనెత్తారని తెలిపారు. అలైన్‌మెంట్‌ను నిపుణుల బృందం ఖరారు చేస్తుందని గుర్తుచేశారు. ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని యోగేశ్‌ పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 01:51 AM