ప్రత్యేక టెట్‌ను రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:42 AM
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని, దానిని రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని పిల్
వివరాలు సమర్పించాలని విద్యాశాఖ అధికారులకు హైకోర్టు సీజే ధర్మాసనం ఆదేశం
తదుపరి విచారణ డిసెంబరు 16 వాయిదా
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని, దానిని రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ప్రతివాదులుగా ఉన్న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ తదితరులకు నోటీసులు జారీచేసింది. టెట్ పరీక్ష నిర్వహణ, క్వశ్చన్ బ్యాంక్‌కు సంబంధించి డిజిటల్ రికార్డులన్నింటినీ భద్రపరుస్తామన్న ప్రభుత్వ న్యాయవాది హామీని నమోదు చేసింది. టెట్ పరీక్షతో ముడిపడి ఉన్న ఇతర ప్రజాహిత వ్యాజ్యాలతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
తిరిగి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి
ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన ప్రత్యేక టెట్-2026 పరీక్షలో అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. ఫలితాల ప్రకటనతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది జి.వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రత్యేక టెట్ పరీక్ష నిర్వహణ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందన్నారు.
వ్యవస్థాగత మాల్ ప్రాక్టీస్ జరిగిందని, పరీక్షలో ఇచ్చే ప్రశ్నలను ముందుగానే ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్ పేరుతో లీప్ యాప్ ద్వారా టీచర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ప్రత్యేక టెట్‌లోని ప్రశ్నలు అన్నింటినీ క్వశ్చన్ బ్యాంక్ నుండే ఇచ్చారన్నారు. మొత్తం 1350 ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు మాత్రమ ఆప్షన్లు మార్పు జరిగాయని, మిగిలిన 1345 ప్రశ్నలు, వాటి ఆప్షన్లు లీప్ యాప్‌లోని ప్రశ్నాపత్రాలతో వంద శాతం పోలి ఉన్నాయని కోర్టుకు తెలిపారు. పిల్ దాఖలు చేసిన అనంతరం లీప్ యాప్‌లోని క్వశ్చన్ బ్యాంక్‌ను తొలగించారన్నారు.
టెట్ పరీక్షకు సంబంధించి డిజిటల్ రికార్డులు, సర్వర్ లాగ్‌లు, క్వశ్చన్ బ్యాంక్ ఫైళ్లు భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫలితాలు కోర్టు ఇచ్చే తుది తీర్పుకి లోబడి ఉండేలా ఆదేశించాలని అభ్యర్ధించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. పిటిషన్ దాఖలై విచారణలో ఉంటే.. ఫలితాలు కోర్టు ఇచ్చే తుది తీర్పుకి లోబడి ఉంటాయని, ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది.
పిటిషనర్ ఆరోపణలు అవాస్తవం
విద్యాశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది గుర్రం రామచంద్రరావు స్పందిస్తూ.. టెట్‌కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయని కోర్టుకు నివేదించారు. ప్రస్తుత పిల్‌ను కూడా వాటిని జత చేయాలని కోరారు. మొత్తం 16 వేల ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలను మాత్రమే పరీక్షలో ఇచ్చారన్నారు. ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాంక్‌లో ఉన్న 1600 ప్రశ్నలలో 1350 ప్రశ్నలను పరీక్షలో ఇచ్చారన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పరీక్ష నిర్వహణ, ప్రశ్న పత్రాలకు సంబంధించి అన్ని డిజిటల్ రికార్డులను భద్రపరుస్తామన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు