Share News

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎంపికైతే..

ABN , Publish Date - Sep 25 , 2026 | 05:36 AM

ఆర్‌ఎస్ఐ, ఏఆర్‌పీసీగా సేవలు అందించి, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా సివిల్‌ ఎస్సైలు, కానిస్టేబుళ్లుగా నియమితులైన వారి పాత సర్వీసును సీనియారిటీ, ఇతర ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎంపికైతే..

  • పాత సర్వీసును పరిగణించడానికి వీల్లేదు

  • స్పష్టం చేసిన హైకోర్టు... ఏపీఏటీ తీర్పులు రద్దు

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎస్ఐ, ఏఆర్‌పీసీగా సేవలు అందించి, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా సివిల్‌ ఎస్సైలు, కానిస్టేబుళ్లుగా నియమితులైన వారి పాత సర్వీసును సీనియారిటీ, ఇతర ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా సివిల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌గా ఎంపికైన తరువాత రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఎస్సై), ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఏఆర్‌పీసీ)గా అందించిన సర్వీసును సీనియారిటీ లెక్కించే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ట్రైబ్యునల్‌(ఏపీఏటీ) ఉత్తర్వులను ధర్మాసనం తప్పుపట్టింది. ఏపీఏటీ 2013, 2014లో ఇచ్చిన తీర్పులను రద్దు చేసింది.

ఈ మేరకు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ సుభేందు సామంతతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. గతంలో ఆర్‌ఎస్ఐలుగా పనిచేసి, 2004 డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఏలూరు రేంజ్‌ సివిల్‌ ఎస్సైలుగా ఎంపికైన దుర్గారావు, మరికొందరు తమ పాత సర్వీసును కూడా కలిపి సీనియారిటీ లెక్కించాలని కోరుతూ ఏపీఏటీని ఆశ్రయించారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్‌పీసీలు కూడా తమ పాత సర్వీసు కాలాన్ని సివిల్‌ కానిస్టేబుల్‌ సర్వీస్‌తో కలపాలని కోరారు. వీరికి అనుకూలంగా ఏపీఏటీ తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఏలూరు రేంజ్‌ డీఐజీ, అనంతపురం జిల్లా ఎస్పీ 2014, 2016లో హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ఏపీ పోలీస్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌లోని 15(సీ) ప్రకారం బదిలీ ద్వారా సివిల్‌ ఎస్సైగా మారినవారికి మాత్రమే పాత సర్వీసు సీనియారిటీ లెక్కింపునకు వర్తిస్తుందని, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఎంపికైన వారికి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి సీనియరిటీ లెక్కిస్తారని స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి...

మహిళల భద్రతకు ప్రాధాన్యం

బజార్‌లో పోస్టుల అమ్మకం

Updated Date - Sep 25 , 2026 | 05:36 AM