ఆ వార్డుల్లో రీపోలింగ్‌కు ఆదేశించలేం
ABN , Publish Date - Nov 07 , 2026 | 05:45 AM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తిరుపతి రూరల్, చంద్రగిరి, పాకాల మండలాల పరిధిలోని పలు వార్డు ల్లో రీపోలింగ్ జరపేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) ఆదేశించలేమని హైకోర్టు స్పష్టంచేసింది.
చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి హైకోర్టు స్పష్టీకరణ
ఎన్నికల ట్రైబ్యునల్‌కే వెళ్లండి: హైకోర్టు
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తిరుపతి రూరల్, చంద్రగిరి, పాకాల మండలాల పరిధిలోని పలు వార్డు ల్లో రీపోలింగ్ జరపేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) ఆదేశించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. కౌంటింగ్ ప్రక్రియను నిలువరించలేమని కూడా తేల్చిచెప్పారు. అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని వైసీపీకి చెందిన పిటిషనర్లు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి(మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు), కోటల పద్మజ, శ్రీలేఖకు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా తిరుపతి జిల్లాలోని పైమండలాల పరిధిలోని పలు వార్డుల్లో అధికార పార్టీ వారు బూత్‌ల స్వాధీనం, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని.. తమ పార్టీ ఏజెంట్లపై దాడిచేసి బెదిరించారని, సంబంధిత కేంద్రాల్లో ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్‌కు ఆదేశాలివ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు.
దీనిపై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తిచేయడంతో న్యాయస్థానం శుక్రవారం ఈ వ్యాజ్యాన్ని లంచ్‌మోహన్‌గా విచారణ కు స్వీకరించింది. ఆయా ఘటనలపై ఎప్పటికప్పుడు ఎస్‌ఈసీ, జిల్లా కలెక్టర్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసినప్పటికే ఎలాంటి స్పందనా లేదని వారి త రఫు న్యాయవాది తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. తిరుపతి రూరల్, చంద్రగిరి, పాకాల మం డల్లాలో పోలింగ్‌లో అక్రమాలు జరిగినట్లు జిల్లా కలెక్ట ర్, అధికారుల నుంచి ఎలాంటి సమాచారమూ లేదని, ఈ నేపథ్యంలో అక్కడ రీపోలింగ్‌కు ఆదేశాలు ఇవ్వలేదన్నారు.
‘ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు కలిగించేలా ప్రతి అరగంటకోసారి పిటిషనర్ ఈ-మెయిల్స్ పంపించారు. కలెక్టర్ ప్రతి చోటకూ అదనపు బలగాలు, ఉన్నతాధికారులను పంపించారు. పిటిషనర్ చెబుతున్న 17 వార్డుల్లో వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది’ అని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. తామిచ్చిన వినతిపత్రాలపై ఎస్‌ఈసీ ఎలాంటి ఆదేశాలూ.. ఎన్నికల సంఘం చెబుతున్న వివరాలను నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఇతర రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని, పోలింగ్ అక్రమాలపై తాము ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు