ప్రతిదీ సీబీఐ విచారణకా?
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:07 AM
డీఎస్సీ 2025 నియామకాల్లో అనర్హులు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యుఎస్) కోటా కింద సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ ...
ఎస్హెచ్ఓ స్థాయికి దానిని దిగజార్చకండి
ఇతర దేశాలతో పోల్చితే మన పోలీసు వ్యవస్థ మెరుగ్గా ఉంది
ఈడబ్ల్యూఎస్లపై అనుమానం ఉంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయొచ్చు
రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని, కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చండి
పిటిషనర్లకు హైకోర్టు ఆదేశం
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ 2025 నియామకాల్లో అనర్హులు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యుఎస్) కోటా కింద సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తూ నేరుగా సీబీఐతో విచారణ చేయించాలని కోరడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
‘అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లపై ఏమైనా అనుమానాలుంటే ముందుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సింది. అనుమానాలు నివృత్తి చేసుకొనేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించి ఉండాల్సింది. ప్రతి అంశంలో నేరుగా సీబీఐ విచారణ కోరడం సముచితం కాదు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థను ఎస్‌హెచ్‌వో స్థాయికి దిగజార్చవద్దు. ఇతర దేశాలతో పోలీస్తే మన పోలీస్ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ప్రస్తుత వ్యాజ్యంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చండి’ అని పిటిషనర్లను ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులిచ్చారు. విచారణను వారం రోజులకు వాయిదా వేశారు.
డీఎస్సీ 2025 నియామకాల్లో ఈడబ్ల్యుఎస్ కోటా కింద 1,500 మంది అనర్హులైన అభ్యర్థులు ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ఈ వ్యవహారంపై ఈ ఏడాది సెప్టెంబరు 23న తాను సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకొని సమగ్ర విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకు చెందిన ప్రతాప్‌రెడ్డి, మరో 8 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈడబ్ల్యుఎస్ కోటా కింద అనర్హులైనవారు ఉద్యోగాలు పొందితే వాటిని రద్దుచేసి, తదుపరి మెరిట్లో ఉన్న పిటిషనర్లకు నియామక ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాము సీబీఐ విచారణకు మాత్రమే ఆదేశించాలని కోరడం లేదని, ఆధారాలను పరిశీలించి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌తో విచారణకు ఆదేశించవచ్చని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ... ‘టీచర్ల నియామకానికి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఉద్యోగాలు పొందినవారి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్లపై అనుమానాలుంటే ఆ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. సర్టిఫికెట్లు రెవెన్యూ అధికారులు జారీ చేసినందున సంబంధిత కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పిటిషన్లో ఎక్కడా పేర్కొనలేదు. సీబీఐ విచారణకు ఆదేశించాలని నేరుగా హైకోర్టును ఆశ్రయించారు’ అని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్డీఎంఏ