Share News

మేమొద్దన్నా విగ్రహాల నిర్మాణమా?

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:16 AM

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో శివపార్వతుల విగ్రహాల ఏర్పాటు చేపట్టవద్దని తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు ఎలా కొనసాగిస్తారని ...

మేమొద్దన్నా విగ్రహాల నిర్మాణమా?

  • నర్సీపట్నం పెద్దచెరువు వ్యవహారంలో హైకోర్టు ఆగ్రహం

  • ఏప్రిల్‌ 1నాటి ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం

  • ధిక్కరణ పిటిషన్‌లో కౌంటర్‌ వేయాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి నిర్దేశం

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో శివపార్వతుల విగ్రహాల ఏర్పాటు చేపట్టవద్దని తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు ఎలా కొనసాగిస్తారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి నిర్మాణాలూ చేయొద్దని ఈ ఏడాది ఏప్రిల్‌ 1న స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చామని, వాటిని కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

చెరువు పరిరక్షణలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్న వాదనను తోసిపుచ్చింది. నీటి వనరులను దెబ్బతీయకుంటే చాలని..వాటికి ఎలాంటి రక్షణా అవసరం లేదని పేర్కొంది. ప్రకృతి సహజసిద్ధంగా తనను తాను సుందరీకరించుకుంటుందని, దానినెవరూ సుందరీకరించాల్సిన అవసరం లేదని తెలిపింది. ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి విగ్రహ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడిని, అధికారులను ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.


ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. పెద్దచెరువులో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అక్రమంగా చేపట్టిన సృష్టిక్షేత్రం నిర్మాణాన్ని నిలిపివేయడంతో పాటు ఆక్రమణలు తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ నర్సీపట్నం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై ఈ ఏడాది ఏప్రిల్‌ 1న విచారణ జరిపిన ధర్మాసనం.. పెద్దచెరువులో శివపార్వతుల విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది. ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నారంటూ ఉమాశంకర్‌ గణేశ్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

పిల్‌తో పాటు ధిక్కరణ పిటిషన్‌ బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి చెరువు మధ్యలో శివపార్వతుల విగ్రహం ఏర్పాటు పనులు సాగిస్తున్నారని.. కోర్టు ఆదేశాలిచ్చిన రోజే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు.

ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. నీటి వనరుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయవచ్చా అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ)ని ప్రశ్నించింది. ఎస్‌జీపీ ఎస్‌.ప్రణతి స్పందిస్తూ.. నీటి వనరు విస్తీర్ణం, నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతినకుండా నిర్మాణాలు చేయడానికి చట్టంలో ఎక్కడా అడ్డంకి లేదన్నారు.


అయ్యన్నపాత్రుడి తరఫు న్యాయవాది వీవీ సతీశ్‌ వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కారణాలతో ప్రజాహిత వ్యాజ్యంలో స్పీకర్‌ను ప్రతివాదిగా చేర్చారని.. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారంటూ కోర్టును తప్పుదోవ పట్టించి ఉత్తర్వులు పొందారని తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో కౌంటర్‌ వేసేందుకు సమయమివ్వాలని కోరారు. అన్ని పక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తదుపరి విచారణలోగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 05:20 AM