Share News

బోధన అనుభవం ఉన్నప్పుడు.. వేతనం కొలమానం కాకూడదు!

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:08 AM

విశ్వవిద్యాలయాల్లో ఏళ్లుగా కాంట్రాక్ట్‌, అడ్‌హక్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌ హోదాలో పనిచేస్తున్న అధ్యాపకులు నిర్దిష్ట వేతన శ్రేణిలో లేరనే కారణంతో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం వారు చేసుకున్న దరఖాస్తులను...

బోధన అనుభవం ఉన్నప్పుడు.. వేతనం కొలమానం కాకూడదు!

  • ఆ షరతుకు పట్టుబట్టకుండా దరఖాస్తులను పునఃపరిశీలించండి

  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులపై యూనివర్సిటీలకు హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో ఏళ్లుగా కాంట్రాక్ట్‌, అడ్‌హక్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌ హోదాలో పనిచేస్తున్న అధ్యాపకులు నిర్దిష్ట వేతన శ్రేణిలో లేరనే కారణంతో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం వారు చేసుకున్న దరఖాస్తులను యూనివర్సిటీలు తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. యూజీసీ నిబంధనలు-2018లోని 10(ఎఫ్‌)(3) ముఖ్య ఉద్దేశం ఎనిమిదేళ్ల గుణాత్మక (క్వాలిటేటీవ్‌) బోధనా అనుభవాన్ని ధ్రువీకరించడమేనని గుర్తుచేసింది. బోధనా అనుభవంపై సందేహం లేనప్పుడు అభ్యర్థుల దరఖాస్తుల విషయంలో వేతనాలను నిర్ణయాత్మక అంశంగా చూడడానికి వీల్లేదని పేర్కొంది. నిబంధన 10(ఎఫ్‌)(3)లో పేర్కొన్న వేతన షరతును పట్టుబట్టకుండా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం పిటిషనర్లు చేసుకున్న దరఖాస్తులను పునఃపరిశీలించాలని యూనివర్సిటీలను ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.విజయ్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సుమారు 1500 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే 15న వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేశారు. దీంతో వివిధ విశ్వవిద్యాలయాల్లో గత 15 ఏళ్లుగా నాన్‌-రెగ్యులర్‌ (కాంట్రాక్ట్‌, అడ్‌హాక్‌, అకడమిక్‌ కన్సల్టెంట్‌) హోదాల్లో బోధనా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అభ్యర్థులు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే యూజీసీ నిబంధనలు-2018, తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 13న జారీచేసిన జీవో 14, అలాగే 2023 జూన్‌ 28న ఇచ్చిన జీవో 20 ప్రకారం అవసరమైన వేతన శ్రేణిలో లేరంటూ దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో గుణకల శివయ్య అభ్యర్థి, మరికొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నీ ఒకే అంశంతో ముడిపడి ఉండంతో న్యాయస్థానం వీటన్నింటినీ కలిపి విచారించింది.


తీర్పులో ఇంకా ఏముందంటే...

‘విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి నియామకాలు జరగలేదు. దీంతో వేర్వేరు హోదాల పేరుతో నియమితులైన అభ్యర్థులు బోధన విధులు నిర్వర్తించారు. ఈ కాలాన్ని లెక్కించే విషయంలో పారదర్శకంగా వ్యవహారించాలి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. అలాగే మాస్టర్స్‌ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు, 8 ఏళ్ల బోధన/పరిశోధన అనుభవం, ప్రచురణలు, పరిశోధన స్కోరు వంటి అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఎలాంటి వివాదం లేదు. అయితే కేవలం అభ్యర్థులు నిర్దిష్ట వేతనశ్రేణిలో లేరనే కారణంతో దరఖాస్తులు తిరస్కరించడాన్ని ఆమోదించలేం. విద్యార్హతలు, అనుభవం అభ్యర్థుల చేతుల్లో ఉంటాయి.

వేతనాలను అర్హత ప్రమాణంగా విధించడం వల్ల అభ్యర్థులు మూడోపక్షంపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి నిబంధన పూర్తిగా ఏకపక్షమైనది. యూజీసీ నిబంధనల్లోని క్లాజ్‌ 13 ప్రకారం కాంట్రాక్ట్‌/ నాన్‌-రెగ్యులర్‌ బోధనా సిబ్బందికి కూడా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌తో సమానంగా వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత ఆయా విశ్వవిద్యాలయాలపైన ఉంది. నిబంధనల మేరకు వేతనాలు చెల్లించకుండా, నిర్దిష్ట వేతన శ్రేణిలో లేరంటూ అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరించడం సరికాదు. న్యాయసూత్రాలకు విరుద్ధంగా యూనివర్సిటీల అధికారులు వ్యవహరించారు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 04:13 AM