Share News

ఫీజు కోసం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:40 AM

పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తామని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం షరతు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

ఫీజు కోసం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం చట్టవిరుద్ధం

  • బకాయిల వసూలుకు వేరే మార్గాలను ఆశ్రయించవచ్చు

  • వారంలో పిటిషనర్‌కు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తిరిగిచ్చేయండి

  • గుంటూరు ఎన్‌ఆర్‌ఐ కాలేజీ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇస్తామని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యం షరతు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఫీజు చెల్లించలేదనే కారణంతో విద్యార్ధుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యం తమ వద్దే అట్టిపెట్టుకోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ‘ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ విద్యార్థి ఆస్తి. ఉన్నత విద్యను అభ్యసించడానికి, వృత్తిపరమైన సంస్థల్లో నమోదు చేసుకోవడానికి, ఉద్యోగం పొందడానికి సర్టిఫికెట్లే పునాది. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్లు రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం జీవించే హక్కు, విద్యాహక్కుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. వాటిని అట్టిపెట్టుకునే హక్కు విద్యాసంస్థలకు ఉండదు. ట్యూషన్‌ ఫీజు, ఇతర ఫీజులు చెల్లించాలని కోరే న్యాయబద్ధమైన హక్కు కళాశాలకు ఉన్నప్పటికీ ఫీజు కోసం సర్టిఫికెట్లు నిలిపివేయడాన్ని అనుమతించలేం’ అని పేర్కొంది.

తీర్పు కాపీ అందిన వారం రోజుల్లో పిటిషనర్‌(విద్యార్థి)కు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ తిరిగిచ్చేయాలని గుంటూరు జిల్లా పేరేచర్లలోని ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిస్ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ శుక్రవారం తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా, మేడికొండూరుకు చెందిన కొరివి కుమార్‌ బాబు 2015-19లో కౌన్సెలింగ్‌ ద్వారా ఎస్సీ జనరల్‌ కేటగిరీ కింద ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో బీటెక్‌(సీఎ్‌ససీ)లో చేరారు. అడ్మిషన్‌ సమయంలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ ఇతర ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ అన్నీ కళాశాలకు సమర్పించారు. తండ్రి మరణించడంతో కుమార్‌ బాబు చదువును మధ్యలోనే ఆపేశారు.


తన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తిరిగి ఇప్పించాలని 2022లో విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అధికారులు ఎన్‌ఆర్‌ఐ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్స్‌ తిరిగిస్తామని యాజమాన్యం చెప్పడంతో సర్టిఫికెట్లు తన జీవనోపాధికి ఆధారమని, వాటిని వెనక్కి ఇవ్వకపోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కుమార్‌ బాబు 2025లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి శుక్రవారం నిర్ణయం వెల్లడించారు.

‘యూజీసీ నోటిఫికేషన్‌ ప్రకారం అడ్మిషన్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాలని ఏ కళాశాల విద్యార్థినీ ఒత్తిడి చేయడానికి వీల్లేదు. సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ కాపీలు సమర్పిస్తే సరిపోతుంది. అడ్మిషన్‌ సమయంలో విద్యార్థి సమక్షంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పరిశీలించి వాటి ప్రామాణికతపై సంతృప్తి చెందిన వెంటనే తిరిగిచ్చేయాలి. ఏ కారణంతోనూ కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లను కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 04:47 AM