Share News

అక్రమ మైనింగ్‌కు అధికారులదే బాధ్యత!

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:16 AM

అక్రమ మైనింగ్‌ జరిగితే అందుకు అధికారులను బాధ్యులను చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ తవ్వకాల నిరోధానికి కఠిన విధానాలు అవలంబించాలని స్పష్టంచేసింది.

అక్రమ మైనింగ్‌కు అధికారులదే బాధ్యత!

  • కట్టడికి కఠినంగా వ్యవహరించాలి: హైకోర్టు

  • మార్గదర్శకాలు రూపొందించండి

  • సమన్వయంతో సమగ్ర అఫిడవిట్‌ వేయండి

  • వేర్వేరుగా దాఖలు చేస్తే ఉపేక్షించేది లేదు

  • మైనింగ్‌, రెవెన్యూ, పర్యావరణ-అటవీ, హోం శాఖలకు ధర్మాసనం నిర్దేశం

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): అక్రమ మైనింగ్‌ జరిగితే అందుకు అధికారులను బాధ్యులను చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ తవ్వకాల నిరోధానికి కఠిన విధానాలు అవలంబించాలని స్పష్టంచేసింది. గనులు, ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని మైనింగ్‌, రెవెన్యూ, పర్యావరణ-అటవీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శులను ఆదేశించింది. అన్ని విభాగాల అధికారులూ కూర్చుని సమన్వయంతో సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని, వేర్వేరుగా అఫిడవిట్లు వేస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్‌)పై విచారణ సందర్భంగా అధికారుల తీరును ఎండగట్టింది. తమ బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని, శాఖల మధ్య సమన్వయ లోపంతో అక్రమ మైనింగ్‌ యథేచ్ఛగా సాగుతోందని వ్యాఖ్యానించింది. ఇసుకను అక్రమం తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసి డ్రైవర్లపై కేసులు పెడుతున్నారు తప్ప సూత్రధారులను కనుగొనేందుకు ప్రయత్నించడం లేదని ఆక్షేపించింది.


అక్రమ మైనింగ్‌ జరగలేదన్నారు కదా..!

బాపట్ల జిల్లా చీరాల మండలం కావురివారిపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలకు సూత్రధారులను గుర్తించేందుకు విశ్రాంత న్యాయమూర్తి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలోని స్వతంత్ర కమిటీతో విచారణకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పిల్‌ వేశారు. గ్రామంలోని సర్వే నంబర్లు 47, 607లలో ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపివేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. పిటిషనర్‌ తరఫున న్యాయవాది రవి ప్రసాద్‌ వాదనలు వినిపించారు. అక్రమ తవ్వకాలకు సంబంధించి 2022, 2024ల్లో తీసిన శాటిలైట్‌ ఫోటోలు ధర్మాసనం ముందు ఉంచారు. 2022లో ఎలాంటి ఇసుక తవ్వకాలూ జరగలేదని.. ఇప్పుడు అదే ప్రాంతంలో భారీ గోతులు ఏర్పడ్డాయని నివేదించారు. రోజూ 200 లారీల్లో ఇసుకను తవ్వి తరలిస్తున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... గత విచారణ సందర్భంగా ఇసుక అక్రమ మైనింగ్‌ జరుగలేదని చెప్పారు కదా అని మైనింగ్‌ శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది సాయివిహారిని ప్రశ్నించింది. సాయివిహారి బదులిస్తూ.. అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్న వారిపై 25 కేసులు నమోదు చేశామన్నారు.

ధర్మాసనం జోక్యం చేసుకుని.. వాహన డ్రైవర్లపై కేసులు పెడితే సరిపోదని, ఇసుక తవ్వకాల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరో గుర్తించారా అని ప్రశ్నించింది. అక్రమ తవ్వకాలను నిరోధిచేందుకు ఏమి చర్యలు తీసుకున్నారని పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జయంతి బదులిస్తూ.. రాత్రి వేళ్లలో నిఘా పెంచామని, పికెట్‌లు నిర్వహిస్తున్నామని బదులిచ్చారు. పలువురిపై కేసులు పెట్టి, వాహనాలు సీజ్‌ చేశామన్నారు. పోలీసులు అంత చురుగ్గా పనిచేస్తుంటే ఇసుక తవ్వకాల వెనుక సూత్రధారులను ఎందుకు గుర్తించలేకపోయారని ధర్మాసనం ప్రశ్నించింది. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలని మైనింగ్‌ శాఖకు సూచించింది. ఇప్పటికే ఉందని సాయివిహారి చెప్పగా.. అది సక్రమంగా పనిచేస్తే వరదలా పిటిషన్లు దాఖలయ్యేవి కావని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:16 AM