Share News

భవిష్యత్‌ అవకాశాలతో బీమా లెక్కించాలి

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:05 AM

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ సెక్యూరిటీ గార్డు కుటుంబానికి హైకోర్టు ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాహన ప్రమాద బీమాను లెక్కగట్టే సమయంలో భవిష్యత్‌ అవకాశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని...

భవిష్యత్‌ అవకాశాలతో బీమా లెక్కించాలి

  • రోడ్డు ప్రమాదం కేసులో హైకోర్టు స్పష్టీకరణ

  • ట్రైబ్యునల్‌ ఇచ్చిన పరిహారాన్ని పెంచుతూ తీర్పు

అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ సెక్యూరిటీ గార్డు కుటుంబానికి హైకోర్టు ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాహన ప్రమాద బీమాను లెక్కగట్టే సమయంలో భవిష్యత్‌ అవకాశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుచేసింది. మోటార్‌ యాక్సిడెంట్‌ ట్రైబ్యునల్‌ మంజూరు చేసిన నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు.

హైదరాబాద్‌లోని జీ4ఎస్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న నాగముని రెడ్డి అనంతపురం జిల్లా, యాడికి పరిధిలో 2009 జనవరి 2న ట్రాక్టర్‌-హార్వెస్టర్‌ ఢీకొని మృతి చెందాడు. తమకు రూ. 6 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మృతుడి తల్లిదండ్రులు యు.లక్ష్మిరెడ్డి, లక్ష్మిదేవి, సోదరుడు యు.నాగేశ్వర్‌ దేవి అనంతపురం మోటార్‌ యాక్సిటెండ్‌ ట్రైబునల్‌ను ఆశ్రయించగా రూ.3,85,420 నష్టపరిహారం మంజూరు చేస్తూ 2011 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చింది.

దీంతో పరిహారం పెంచాలంటూ 2012లో హైకోర్టులో అప్పీల్‌ వేశారు. ‘సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు మృతుడికి 40 ఏళ్ల లోపు వయసు ఉండి, స్థిర వేతనం పొందుతుంటే ఇప్పటికే ఉన్న ఆదాయానికి 40 శాతం అదనంగా కలపాల్సి ఉంటుంది. ప్రస్తుత కేసుకు ఇదే సూత్రం వర్తిస్తుంది. లాస్‌ ఆఫ్‌ డిపెండెన్సీ, ప్యూచర్‌ ప్రాస్పెక్ట్స్‌ కింద ట్రైబ్యునల్‌ మంజూరు చేసిన పరిహారాన్ని రూ. 6,40,764కు పెంచుతున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. అలాగే లాస్‌ ఆఫ్‌ కన్సార్టియం కింద రూ. 96 వేలు, లాస్‌ ఆఫ్‌ ఎస్టేట్‌ కింద రూ.18 వేలు, అంత్యక్రియల ఖర్చుల కింద ట్రైబ్యునల్‌ మంజూరు చేసిన రూ. 2 వేలను రూ.18 వేలకు పెంచారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 04:05 AM