అవి ఆధారాల్లేని ఆరోపణలు!
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:33 AM
షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నుంచి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ...
అనుమానాలు, ఊహాగానాలతో సీబీఐ విచారణ కోరలేరు
షిర్డీ సాయి సంస్థకు ట్రాన్స్‌ఫార్మర్ల టెండర్‌పై హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ నివేదన
అధిక ధరలతో ట్రాన్స్‌ఫార్మర్లు కొని ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారు
విశ్రాంత ఐపీఎస్ ఏబీవీ వాదనలు
పిల్‌పై విచారణ నేటికి వాయిదా
అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నుంచి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ సంస్థకు మేలు చేసేలా టెండర్ నిబంధనలు రూపొందించారని ఆరోపించడమే తప్ప.. వాటిని నిరూపించే ఎలాంటి ప్రాథమిక ఆధారాలనూ పిటిషనర్ కోర్టు ముందు ఉంచలేదని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సంబంధిత అథారిటీని కూడా ఆయన సంప్రదించలేదని.. నిర్దిష్ట ఆధారం లేకుండా కేవలం అనుమానాలు, ఊహాగానాలతో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరలేరని తెలిపారు.
ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లకు సంబంధించి ఏపీఎస్‌పీడీసీఎల్ 2021 నుంచి ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్లపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తాను దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏబీవీ.. మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఎదుట స్వయంగా వాదనలు వినిపించారు. షిర్డీసాయి సంస్థకు అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించారని, ఆ సంస్థ నుంచి ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రభుత్వం రూ.1.40 లక్షలకు కొనుగోలు చేస్తోందని.. తెలంగాణ ప్రభుత్వం వేరే సంస్థ నుంచి రూ.85 వేలకే కొంటోందని.. దాదాపు రూ.55 వేల వ్యత్యాసం ఉందన్నారు. ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేశారని తెలిపారు. ఏజీ స్పందిస్తూ.. షిర్డీసాయి సంస్థ 2022 నుంచీ ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేస్తోందన్నారు. ఇన్నేళ్ల తర్వాత పిటిషన్ దాఖలు చేయడానికి కారణాలను పిటిషనర్ పేర్కొనలేదని తెలిపారు.
‘టెండర్ నిబంధనల కారణంగా తమకు అన్యాయం జరిగిందని ఏ సంస్థా హైకోర్టును ఆశ్రయించలేదు. ఒక సంస్థ పిటిషన్ వేసి.. తర్వాత ఉపసంహరించుకుంది. మూడో పక్షం వచ్చి టెండర్ నిబంధనలను సవాల్ చేయజాలదు. ఈ విషయంలో స్పష్టమైన తీర్పులు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల ధరలతో.. షిర్డీసాయి సంస్థ సరఫరా చేస్తున్న వాటిని పోల్చడానికి వీల్లేదు. సాంకేతికంగా, ప్రమాణాలపరంగా పలు అంశాల్లో వ్యత్యాసం ఉంది’ అని పేర్కొన్నారు. ఆధారాలు లేనందున పిల్‌ను కొట్టివేయాలని కోరారు. షిర్డీసాయి సంస్థ తరపున సీనియర్ న్యాయవాది శ్రీరఘురామ్ వాదనలు వినిపించారు. ‘ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఒక వస్తువు కాదు. అనేక విడి భాగాలతో అది తయారవుతుంది. వాడే విడి భాగాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయంగా కూడా షిర్డీసాయి సంస్థ ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేస్తోంది. టెండర్ నిబంధనల వల్ల తమకు నష్టం జరిగిందని భాగస్వామ్య పక్షాలేవీ కోర్టును ఆశ్రయించలేదు. సాంకేతిక అంశాలను తేల్చేందుకు ఏపీఈఆర్‌సీ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ల ధరలపై పిటిషనర్ ఇప్పటికే దానిని ఆశ్రయించారు.
ఈ విషయాన్ని పిల్‌లో వెల్లడించలేదు. సీబీఐ విచారణకు ఆదేశించేందుకు పిటిషనర్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలనూ కోర్టు ముందు ఉంచలేదు. ఆయన పిటిషన్‌ను కొట్టివేయండి’ అని కోర్టును అభ్యర్థించారు. వాదనల కొనసాగింపునకు తదుపరి విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం