‘రాప్తాడు’ నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై హైకోర్టు ఆందోళన
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:43 AM
అనంతపురం జిల్లా, రాప్తాడు జడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి విద్యార్థినిపై రంపంత దాడి ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
బడి పిల్లల రక్షణకు తక్షణ చర్యలు అవసరం
మార్గదర్శకాలు రూపొందించండి
నివేదిక రూపంలో మా ముందు ఉంచండి
రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా, రాప్తాడు జడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి విద్యార్థినిపై రంపంత దాడి ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల రక్షణకు తక్షణం భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇలాంటి ఘటనలు జరిగితే పాఠశాలలకు పిల్లలను పంపించే తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని పేర్కొంది.
విద్యార్థుల భద్రత కోసం తక్షణ రక్షణ చర్యలు అవసరమంది. అధికారులు తీసుకునే నిర్ణయాలు కాగితాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పాఠశాలలకు వచ్చే పిల్లల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించి నివేదిక రూపంలో తదుపరి విచారణలో తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు భవనాలు నిర్మించడంతో పాటు ప్రహరీల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు కోరుతూ కాకినాడకు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైౖర్మన్/ మేనేజింగ్ ట్రస్టీ కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది.
విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది గుర్రం రామచంద్రరావు స్పందిస్తూ... ‘విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రహరీల నిర్మాణానికి నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది’ అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ...ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన చర్యలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. కొన్ని పాఠశాలల్లో ఐడీ కార్డు చూపిస్తేనే తలిదండ్రులను సైతం అనుమతిస్తున్నారని తెలిపింది.
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్డీఎంఏ