ఏడేళ్లయినా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా..!
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:05 AM
రాష్ట్రంలోని కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఇప్పటికీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం కోర్టు ధిక్కరణే
కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
ఖర్చుతో సంబంధం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
ఈ వ్యవహారంపై తాజా వివరాలు మా ముందుంచండి
ఎస్‌జీపీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతందనేది తమకు సంబంధం లేని విషయమని పేర్కొంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చి ఏడేళ్లు గడిచిందని, ఆదేశాలు అమలు కాకపోవడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తాము ఆదేశాలిచ్చే పరిస్థితి తీసుకురావొద్దని పేర్కొంది. సీసీ కెమెరాల ఏర్పాటుపై తాజా వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకురాగా పార్టీ ఇన్‌పర్సన్ యోగేశ్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు కాలేదని చెప్పారు. హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్‌వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ... సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 12న బడ్జెట్ విడుదల చేసిందన్నారు.
అయితే ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధుల విడుదలకు సంబంధించి తాజాగా జీవో జారీ చేయాల్సి ఉందన్నారు. బడ్జెట్ విడుదలైన వెంటనే టెండర్ పిలుస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) యతీంద్ర దేవ్ స్పందిస్తూ... సీసీ కెమెరాల ఏర్పాటు కోసం అవసరమైన నిధులకు సంబంధించి బడ్జెట్ ఆమోదం కోసం ఫైలు ఆర్థికశాఖ వద్ద ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు బాధ్యతను హైకోర్టు తీసుకుందన్నారు. ఈ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోర్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తాజా వివరాలు తమ ముందుంచాలని ఎస్‌జీపీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట