Share News

‘గ్రూప్‌-1’లో అడుగడుగునా అక్రమాలే!

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:09 AM

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అడుగడుగునా అక్రమాలు జరిగాయని ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థులు హైకోర్టుకు విన్నవించారు.

‘గ్రూప్‌-1’లో అడుగడుగునా అక్రమాలే!

  • సిట్‌ బృందం నివేదికే దీనికి కీలక సాక్ష్యం

  • ఉద్యోగాలకు ఎంపికైన 165 మందిలో 160 మంది ఓఎంఆర్‌ స్లిప్పులపై దిద్దుబాట్లు

  • ఉద్యోగాలకు ఎంపికకాని వారి వాదనలు

  • ఎగ్జామినర్ల పొరపాట్లకు అభ్యర్థులను బాధ్యులను ఎలా చేస్తారు?

  • వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌-1పై హైకోర్టులో విచారణ కొనసాగింపు

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అడుగడుగునా అక్రమాలు జరిగాయని ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థులు హైకోర్టుకు విన్నవించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ విధి నిర్వహణలో అన్ని రకాలుగా విఫలమైందని అభ్యర్ధుల తరఫు న్యాయవాదులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనం ప్రతిదశలోనూ అక్రమాలు జరిగాయని, సిట్‌ నివేదికే అందుకు సాక్ష్యమని తెలిపారు. హాయ్‌ల్యాండ్‌లో ఎలాంటి మూల్యాంకనం జరగలేదని ఏపీపీఎస్సీ మొదట కోర్టును తప్పుదోవ పట్టించిందని, ఆ తరువాత తప్పు జరిగినట్లు ఒప్పకొందని గుర్తుచేశారు. ‘‘ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చెబుతున్నట్లు అవి చిన్న అవకతవకలు కాదు. భారీస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. డిజిటల్‌ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల్లో 62శాతం మంది మాన్యువల్‌ మూల్యాంకనంలో ఎంపిక కాలేదు. డిజిటల్‌ మూల్యాంకనంతో పోలిస్తే మాన్యువల్‌ మూల్యాకనంలో 197 మంది అభ్యర్థుల మార్కులు పెరిగాయి. 222 మంది మార్కులు తగ్గినట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో తేలింది. ఉద్యోగాలకు ఎంపికైన 165 మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపగా 160 మంది అభ్యర్థుల షీట్లపై దిద్దుబాట్లు, ఓవర్‌ రైటింగ్‌లు ఉన్నట్లు స్పష్టమైంది. సింగిల్‌ జడ్జి తీర్పు ప్రకారం మెయిన్స్‌ రద్దుచేసి తిరిగి నిర్వహించేలా ఆదేశించాలి. లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించాలి.’’ అని కోరారు. మంగళవారం కోర్టు సమయం ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డి. రమేశ్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.


కార్యదర్శికి ఆ అధికారం లేదు

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభినందన్‌ కుమార్‌ శావలి, శ్రీ రఘురామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘జవాబుపత్రాల మూల్యాంకనం విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేదు. హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ప్రక్రియ మొత్తం పూర్తిగా చట్టవిరుద్ధం. అది నిబంధనలకు అనుగుణంగా జరగనందునే విజయవాడలో మరోసారి మూల్యాంకనం చేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఓఎంఆర్‌ షీట్లపై కరెక్షన్స్‌ చేయడం, రాసినవాటిని దిద్దడం ఎగ్జామినర్లు చేసిన పొరపాట్లు. వాటికి.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను బాధ్యులను చేయడం సరికాదు. అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు సిట్‌ ఎక్కడా నిర్ధారించలేదు.’’ అని కోర్టుకు వివరించారు.

రీ వాల్యుయేషన్‌ కోరలేరు: ఏపీపీఎస్సీ

ఏపీపీఎస్సీ తరఫున ప్రభుత్వ న్యాయవాది జీవీఎల్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు రీకౌంటింగ్‌ మాత్రమే కోరగలరు. రీ వ్యాల్యుయేషన్‌ కోరలేరు. సింగిల్‌ జడ్జి ఆదేశాలను అనుసరించి మాన్యువల్‌ మూల్యాంకనం చేపట్టారు. గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష నిర్వహణపై ఎలాంటి ఆరోపణలు లేవు. జవాబుపత్రాల మూల్యాంకనంపైనే ఆరోపణలు వచ్చాయి. హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనానికి సంబంధించి ఏపీపీఎస్సీ వద్ద ఎలాంటి ప్రొసీడింగ్స్‌ అందుబాటులో లేవు.’’ అని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. విజయవాడలో జవాబుపత్రాల మూల్యాంకనం నిర్ణయానికి ముందు హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ప్రక్రియను చెల్లనిదిగా ప్రకటిస్తూ.. ఏపీపీఎస్సీ ఏమైనా తీర్మానం చేసిందా? అని ఆరా తీసింది. ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది అలాంటిదేమీ లేదన్నారు.


84 రోజులపాటు అక్రమాలు!

ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థుల తరఫున సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌, న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్‌ వాదనలు వినిపించారు. ప్రైవేటు ప్రాంతంలో జవాబు పత్రాలను 84రోజుల పాటు ఉంచారని, అక్రమాలకు అవకాశం కల్పించారని తెలిపారు. ‘‘హాయ్‌ల్యాండ్‌లో జరిగిన మాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అప్పటి కార్యదర్శి పీఎస్ఆర్‌ ఆంజనేయులపై ఏపీపీఎస్సీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీపీఎస్సీ అప్పీల్‌ వేయడం సరికాదు. జవాబుపత్రాలను పరిశీలించేందుకు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ శంకర్‌ నేతృత్వంలో ధర్మాసనం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో న్యాయవాదులు కూడా ఉన్నారు. జవాబుపత్రాలపై వేర్వేరు సిరాలతో రాసినట్లు, వైట్‌నర్‌ ఉపయోగించినట్లు, జవాబుపత్రాలను పిన్‌ చేసినట్లు న్యాయవాదులు గుర్తించారు. కమిటీ నివేదిక ఆధారంగా వాస్తవాలు తేల్చేందుకు ధర్మాసనం సిట్‌ ఏర్పాటు చేసింది. హాయ్‌ల్యాండ్‌లో మ్యాన్యువల్‌ మూల్యాంకనం నిబంధనలకు అనుగుణంగా జరగకుంటే.. విజయవాడలో మరోసారి మూల్యాంకనం చేసేందుకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ కోర్టు నుంచి అనుమతి తీసుకొని ఉండాల్సింది. అలా చేయలేదు. కోర్టు ఇచ్చే తుది తీర్పుకి లోబడి ఉంటామని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏపీపీఎస్సీకి లిఖితపూర్వక హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు ఈక్విటీ కోరలేరు. సింగిల్‌ జడ్జి ఆదేశాలకు అనుగుణంగా మరోసారి మూల్యాంకనం చేయాల్సిన అవసరం లేదు. జవాబుపత్రాలను ప్రైవేటు ప్రాంతానికి తరలించి 84రోజులపాటు అక్కడే ఉంచారు. అక్రమాలు జరిగే ఆస్కారం కల్పించారు.’’ అని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 06:09 AM