Share News

అత్యవసర పనులపై సీఈ, ఎస్‌ఈలకు నిర్ణయాధికారం

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:23 AM

అత్యవసర సమయాలు, విపత్తుల వేళ రహదారుల నిర్వహణ కోసం పనులు మంజూరుచేసే అధికారాన్ని చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ), జిల్లాల సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ)లకు అప్పగిస్తూ రోడ్లు, భవనాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

అత్యవసర పనులపై సీఈ, ఎస్‌ఈలకు నిర్ణయాధికారం

  • నామినేషన్‌ విధానంలో వర్క్‌లు ఇచ్చేందుకూ అనుమతి

  • ఆర్‌అండ్‌బీ కీలక ఉత్తర్వులు.. ఈఈలు నిమిత్తమాత్రులే

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అత్యవసర సమయాలు, విపత్తుల వేళ రహదారుల నిర్వహణ కోసం పనులు మంజూరుచేసే అధికారాన్ని చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ), జిల్లాల సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ)లకు అప్పగిస్తూ రోడ్లు, భవనాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ శుక్రవారం ఉత్తర్వు (జీవో 656) జారీ చేశారు. సాధారణంగా అత్యవసర వర్క్‌ల అధికారాన్ని నిర్ణీత కాలవ్యవధితో సీఈలకు అప్పగించేవారు. ఇప్పుడు అన్ని సందర్భాల్లో అమలయ్యేలా, కాలపరిమితి లేకుండా సీఈలు, ఎస్‌ఈలకు అత్యవసర వర్క్‌లు మంజూరు చేసే అధికారం కల్పించారు.

తుఫాన్లు, వరదలు, ఆకస్మిక వర్షాలు, ఇతర విపత్తుల వల్ల రహదారులు దెబ్బతిన్నప్పుడు వాటికి తక్షణ మరమ్మతులు చేసే అధికారం వీరికి ఇచ్చారు. సీఈలకు పరిపాలనా పరంగా పూర్తిస్థాయిలో వర్క్‌ల మంజూరు అధికారాలు ఇవ్వగా, ఎస్‌ఈలకు రూ.10 లక్షల విలువైన వర్క్‌లు మంజూరుచేసే అధికారం కట్టబెట్టారు. అత్యవసర సమయాల్లో పనులను నామినేషన్‌ పద్ధతిలో కంపెనీలు, కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు సాంకేతిక మంజూరు అధికారాలు పరిమితంగా కల్పించారు. సీఈలు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వర్క్‌లు నామినేషన్‌పై ఇవ్వవచ్చు. ఎస్‌సీలకు 10 లక్షల వరకు అనుమతి ఇచ్చారు.

అయితే అత్యవసర అధికారాల నుంచి డివిజన్‌ స్థాయిలో ఉండే ఈఈలను మినహాయించారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉండేది వీరే. ఎస్‌ఈలు జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఉంటారు. ఎక్కడ, ఏ సమస్య వచ్చినా ముందుగా వెళ్లి సమస్యను పరిశీలించేది ఈఈ, ఏఈఈలే. తాజా నిర్ణయంతో స్థానికంగా తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ సమస్య పరిష్కారానికి ఈఈలు చొరవ తీసుకునే అవకాశం లేకుండా పోతుంది.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 05:28 AM