Share News

ఏపీలో ఆర్‌ఆర్‌ఆర్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:52 AM

ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్‌ ఆర్‌ సంకల్పంతో ముందుకు సాగుతోందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు...

ఏపీలో ఆర్‌ఆర్‌ఆర్‌

  • పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయంతో ముందుకు

  • క్వాంటమ్‌ కంప్యూటింగ్‌తో అమరావతిలో కొత్త అధ్యాయం

  • 175 నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కుల కార్యాచరణ

  • సామాజిక భద్రత, సాధికారితతోనే నిజమైన పునరుద్ధరణ

  • ఉభయ సభల ఉమ్మడి భేటీలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్‌ ఆర్‌ సంకల్పంతో ముందుకు సాగుతోందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. అవి పునర్నిర్మాణం(రీబిల్డ్‌), పునరుద్ధరణ (రెన్యూ), పురోగతి (రైజ్‌)గా పేర్కొన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. గత 19నెలలుగా ప్రభుత్వం రాష్ట్ర పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి వైపు స్పష్టమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. మానవ వనరుల సామర్థ్యం, సుస్థిరాభివృద్ధి, జవాబుదారీతనంతో కూడిన పాలనతో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక పరివర్తన దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ మార్పు సంక్షోభం నుంచి ఆత్మవిశ్వాసం వైపు ప్రయాణాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. ‘‘2024లో బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాది నుంచే సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేసేందుకు ఏడాదికి సుమారు రూ.33వేల కోట్లు వ్యయం చేయడం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్‌ భరోసా కింద 63.12 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం వారికి గౌరవం, భరోసా కల్పిస్తోంది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా 66లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ఏడాదికి రూ.15వేలు బదిలీ చేస్తున్నాం. గత స్వాతంత్య్ర దినోత్సవం నుంచి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు 37.8 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించాం. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.86 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందుతోంది. దీపం 2.0 ద్వారా 1.08 కోట్ల పేద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందిస్తూ కుటుంబ నిర్వహణ భారాన్ని తగ్గిస్తున్నాం. మెగా డీఎస్సీ -2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులు, శాంతిభద్రతల పరిరక్షణకు 5,757 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టాం. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 2.90 లక్షల మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. మత్స్యకార సేవలో కార్యక్రమంలో భాగంగా 1.2 లక్షలకు పైగా మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సాయం అందుతోంది. ఏప్రిల్‌ 1నుంచి లక్షకు పైగా చేనేత కుటుంబాలు 200 యూనిట్ల వరకు, మరమగ్గ చేనేత కుటుంబాలు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సదుపాయం పొందుతారు’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర పునరుజ్జీవం, ప్రగతి వేగం మనందరి సమష్టి భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ప్రజల సహకారం, నిర్మాణాత్మక భాగస్వామ్యం ఉన్నప్పుడే సంస్కరణల ఫలాలు వేగంగా, అందరికీ సమానంగా అందుతాయని, అభివృద్ధి ప్రక్రియలో పౌరులు చురుగ్గా భాగస్వాములైనప్పుడు ప్రగతి మరింత వేగవంతమవుతుందని వివరించారు.


గవర్నర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు...

  • సామాజిక భద్రత, సాధికారితతోనే నిజమైన పునరుద్ధరణ సాధ్యమవుతుందని ప్రభుత్వం గుర్తించింది. అసంపూర్ణ పథకాలకు బదులుగా, ఫ్యామిలీ బెనిఫిట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తూ పేదరికాన్ని నిర్మూలిస్తున్నాం.

  • గత ఉగాది రోజున ప్రారంభించిన పీ4 కింద ఇప్పటివరకు లక్షమందికి పైగా మార్గదర్శులు 10.30 లక్షల బంగారు కుటుంబాలను స్వచ్ఛందంగా దత్తత తీసుకున్నారు.

  • ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న ఆశయంతో అన్న క్యాంటీన్‌ కార్యక్రమం సామాజిక సంక్షేమానికి మూలస్తంభంగా కొనసాగుతోంది.

  • స్వర్ణాంధ్ర విజన్‌- 2047 కింద అందరికీ ఇల్లు లక్ష్యంతో గృహనిర్మాణం, పౌష్టికాహార కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం.

  • ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం ద్వారా రిజర్వేషన్లు, ప్రభుత్వ ఫలాలు ప్రతి ఉపవర్గానికి అందేలా చూస్తున్నాం.

  • గిరిజన సమాజాల సామాజిక ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది.. చట్టసభలు, స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి కట్టుబడి ఉంది.

  • మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ, పారదర్శకమైన పాలనను అందించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

  • నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌ ద్వారా అమరావతిలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం.


  • వైద్య ఖర్చులు కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టకుండా ఉండేలా ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తున్నాం. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో డేటా ఆధారిత విధానాల ద్వారా మాతా, శిశు ఆరోగ్యం, పోషణ, వ్యాధి నియంత్రణను మెరుగుపరుస్తున్నాం.

  • రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ.2.50 లక్షల సమగ్ర ఆరోగ్య బీమా కల్పించేందుకు ఒక యూనివర్సల్‌ కవరేజ్‌ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం.

  • నాటు సారా తయారీ నుంచి విముక్తి పొందిన రాష్ట్రంగా ఏపీ 2025లో ఒక నిర్ణయాత్మక మలుపుగా నిలిచింది.

  • జీ రామ్‌ జీ చట్టం-2025 అమలు ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 నుంచి 125కు ఉపాధి పనిదినాలు పెరిగాయి.

  • స్వయం కార్యక్రమం కింద ఈ సంవత్సరం లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

  • విశాఖపట్నం, అమరావతి, తిరుపతిని కేంద్ర బిందువులుగా చేస్తూ మూడు సమీకృత వృద్ధి ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నాం.

  • 175 నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నాం.

  • కొప్పర్తి, ఓర్లకల్లు పారిశ్రామిక క్లస్టర్లు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని బలోపేతం చేస్తున్నాయి.

  • రూ.4,498 కోట్ల విద్యుత్తు బకాయిలు భరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ట్రూడౌన్‌తో యూనిట్‌కు 13 పైసల విద్యుత్‌ చార్జీ తగ్గింది.

శాశ్వత రాజధానిగా అమరావతి

ఏపీ రాజధాని అమరావతి పునర్మిర్మాణం కొత్త ఉత్సాహంతో, వేగంగా జరుగుతోందని, దీనికి కేంద్రం నుంచి సహకారం అందుతోందని గవర్నర్‌ తెలిపారు. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే దిశగా చట్టాన్ని తీసుకొచ్చే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని చెప్పారు.

Updated Date - Feb 12 , 2026 | 01:52 AM