సెల్ టవర్లకు అద్దె, విద్యుత్ చార్జీలు మినహాయిస్తూ ఉత్తర్వులు..
ABN , Publish Date - Aug 08 , 2026 | 07:04 AM
ఏపీలోని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వందలాది సెల్‌ఫోన్ టవర్లను ఏర్పాటు చేసి 100 శాతం సిగ్నల్ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది..
అమరావతి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వందలాది సెల్‌ఫోన్ టవర్లను ఏర్పాటు చేసి 100 శాతం సిగ్నల్ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్తగా సెల్ టవర్లు ఏర్పాటు చేసే సెల్యులర్ కంపెనీలకు అద్దె మినహాయింపుతో భూమి, రాయితీతో కూడిన విద్యుత్ చార్జీలు అమలు చేయాలని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు సూచిస్తూ ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్, కలెక్టర్లు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. ఈ దిశగా కార్యాచరణను అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.