దరఖాస్తుకు మైగ్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:27 AM
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ధ్రువీకరణ సమయంలో స్థానికత సర్టిఫికెట్ ఉండాలి
నియామకాలపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు దరఖాస్తులు స్వీకరించాలని ఏపీపీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పాఠశాల విద్యా శాఖ, జిల్లా ఎంపిక కమిటీల(డీఎస్సీ)ను ఆదేశిస్తూ సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయిన 2024 జూన్ 1 నాటికి లేదా అంతకంటేముందు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినవారికి ఇది వర్తిస్తుంది.
అయితే అభ్యర్థులు ఆ గడువులోగా తాము తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినట్లు ధ్రువీకరణ సమయంలో సర్టిఫికెట్ సమర్పించాలి. కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల ప్రకారం స్థానికత సర్టిఫికెట్లు జారీచేసే అంశంపై ప్రభుత్వం తుది మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో నూతన జిల్లాల ప్రకారం స్థానికతను ఎలా క్లెయిమ్ చేయాలనే విషయం వలస వచ్చినవారికి అర్థం కావట్లేదు. అయితే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు దరఖాస్తు సమయంలోనే మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాలనే నిబంధనతో తెలంగాణ నుంచి వచ్చినవారు దరఖాస్తుకే అనర్హులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్