బీసీ కోటాపై గొడ్డలి పార్టీ కుట్రలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:37 AM
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఢిల్లీ వేదికగా న్యాయపోరాటానికి నడుం బిగించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను సాఫీగా అమలు చేసే లక్ష్యంతో సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించనుంది.
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణే కూటమి ప్రభుత్వ ధ్యేయం
జగన్ నిర్వాకంతో 16 వేల మందికి పైగా వెనుకబడిన తరగతుల వారికి అన్యాయం
కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్న, కొలుసు, అనగాని మండిపాటు
న్యాయ పోరాటం కోసం ఢిల్లీలో మకాం
న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు
న్యూఢిల్లీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఢిల్లీ వేదికగా న్యాయపోరాటానికి నడుం బిగించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లను సాఫీగా అమలు చేసే లక్ష్యంతో సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించనుంది. ఈ నేపథ్యంలో పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ ఢిల్లీలో మకాం చేశారు. మంగళవారం ఏపీభవన్‌లో న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం, మంత్రులు మీడియాతో మాట్లాడారు. జగన్ నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం బీసీ ద్రోహిగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లపై గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బీసీల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 35 ఏళ్లపాటు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, 1982లో టీడీపీని స్థాపించాకే బీసీలకు రాజకీయ గుర్తింపు దక్కిందని గుర్తుచేశారు. ‘‘1987లో ఎన్టీఆర్ చట్ట సవరణ చేసి స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, 1995లో నాటి సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి దాన్ని 34 శాతానికి పెంచారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సహా గత ప్రభుత్వాలన్నీ 34 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాయి. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. కోర్టు సాకు చూపి దొడ్డిదారిన ఆ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారు’’ అని మండిపడ్డారు.
ఎందుకంత కక్ష: రామ్మోహన్‌నాయుడు
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. సరైన లెక్కలు సమర్పిస్తే 50 శాతం మించి కూడా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, గత జగన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకుండా చేతులెత్తేసిందని విమర్శించారు. ‘‘మేము అధికారంలోకి రాగానే సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీల గణాంకాలను సేకరించి, సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదించేందుకు సిద్థమయ్యాం. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలైతే దాదాపు 16,800 మంది బీసీలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మేయర్లుగా ఎదుగుతారు. కానీ, దీనిని అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ నాయకులు లేనిపోని అంశాలను తెరపైకి తెస్తూ కుట్రలు పన్నుతున్నారు’’ అన్నారు. ‘‘బీసీలపై ఎందుకంత కక్ష?.’’ అని జగన్‌ను ప్రశ్నించారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. గత పాలకుడు జగన్ ఢిల్లీకి వచ్చింది కేవలం తన బెయిళ్లను పొడిగించుకోవడానికి, అక్రమాస్తులను కాపాడుకోవడానికి మాత్రమేనని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్ర సంక్షేమం, రైతుల ప్రయోజనాలు, పరిశ్రమల పెట్టుబడుల కోసమే ఢిల్లీకి వస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. చంద్రబాబు ఎన్నో రాజకీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధి ఆకాంక్షిస్తారని తెలిపారు. మీడియా సమావేశంలో ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!