ఏపీఎండీసీకి 1021 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:55 AM
మైనింగ్‌రంగంలో క్రియాశీలకంగా ఎదుగుతూ అనేక కొత్త ప్రాజెక్టులు చేపడుతోన్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు సర్కారు బ్యాంక్ గ్యారంటీని పెంచింది.
ఇకపై పెద్ద బిడ్డింగుల్లోనూ పాల్గొనే అవకాశం
త్వరలో 6 రాష్ట్రాల పరిధిలో బొగ్గు బ్లాక్‌ల వేలం
అమరావతి, నవంబరు(ఆంధ్రజ్యోతి): మైనింగ్‌రంగంలో క్రియాశీలకంగా ఎదుగుతూ అనేక కొత్త ప్రాజెక్టులు చేపడుతోన్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు సర్కారు బ్యాంక్ గ్యారంటీని పెంచింది. ఇప్పటి వరకు ఆ సంస్థకు ప్రభుత్వం ఇస్తోన్న బ్యాంక్ గ్యారంటీ రూ.906.52 కోట్లు కాగా, ఇప్పుడు మరో రూ.115 కోట్లమేర బ్యాంక్ గ్యారంటీని పెంచుతూ అనుమతి ఇచ్చింది.
గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా సోమవారం ఈ ఉత్తర్వులు(జీఓ 279) జారీ చేశారు. దీంతో సర్కారు నుంచి ఏపీఎండీసీకి వచ్చిన బ్యాంక్ గ్యారంటీ నికరంగా రూ.1021.52 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ గ్యారంటీ వెయ్యికోట్లపైనే ఉండటంతో పెద్ద బిడ్డింగుల్లో పాల్గొనే అవకాశం దక్కింది. త్వరలో జరిగే దేశీయ బొగ్గు బ్లాక్‌ల వేలంలో ఏపీఎండీసీ పాల్గొననుంది. అలాగే, త్వరలో మరో ఆరు రాష్ట్రాల పరిధిలో కేంద్రం బొగ్గు గనుల బ్లాక్‌లను వేలం వేయనుంది.
ఈ వార్తలనూ చదవండి: