Share News

మంత్రుల బృందం సమావేశంలో కీలక నిర్ణయాలు.. ఫేక్ న్యూస్ పెట్టే వారిపై కఠిన చర్యలు

ABN , Publish Date - Jan 28 , 2026 | 09:21 PM

సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై బుధవారం సచివాలయంలో మంత్రి లోకేష్ అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం అయింది. నిర్ణీత వయసు కలిగిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశం సందర్భంగా అధికారులను ఆదేశించారు.

మంత్రుల బృందం సమావేశంలో కీలక నిర్ణయాలు.. ఫేక్ న్యూస్ పెట్టే వారిపై కఠిన చర్యలు
AP social media policy

అమరావతి, జనవరి 28: నిర్ణీత వయసు కలిగిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయమై విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై బుధవారం సచివాలయంలో మంత్రి లోకేష్ అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం అయింది.


చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్‌ను పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను కోరారు. చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే ఎంత వయోపరిమితి విధించాలనే విషయమై వివిధ దేశాల్లో చట్టాలను పరిశీలించాల్సిందిగా మంత్రుల బృందం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మలేషియాలో మై డిజిటల్ ఐడీ, పాస్ పోర్టు వివరాలతో ఈ-కేవైసీ అనుసంధానం ద్వారా 16 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.


ఇక, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేసే వారితో పాటు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే హెబిచ్యువల్ అఫెండర్స్‌(పదేపదే నేరాలకు పాల్పడేవారు)ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. దీనిపై చర్చించేందుకు గూగుల్, మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాం కంప్లయన్స్ ఆఫీసర్లను కూడా వచ్చే జీవోఎం సమావేశానికి రప్పించాలన్నారు.


సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు సెక్షన్-46 ఐటీ యాక్ట్ ప్రకారం రాష్ట్రస్థాయి నిర్ధారణ అధికారి (అడ్జుడికేటింగ్ ఆఫీసర్) నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయం జరిగింది. కేంద్రప్రభుత్వ అధీనంలోని సహయోగ్ పోర్టల్ ద్వారా కొన్ని కేసుల విషయంలో చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు అధికారులు మంత్రుల బృందానికి తెలిపారు. ఇక, ఈ సమావేశంలో కంప్యూటర్ రిలేటెడ్ ఎఫెండర్స్, సైబర్ లా ఎఫెండర్స్ కట్టడి, సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చ జరిగింది.


ఇవి కూడా చదవండి

వామ్మో.. 65 ఏళ్లుగా ఒకే సంస్థలో మేనేజర్‌గా మహిళ! వైరల్ వీడియో!

అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్.. ఈ సారి ఏకంగా 16 వేల మంది..

Updated Date - Jan 28 , 2026 | 09:40 PM