ఏడాదిలోగా వేతన సవరణ నివేదిక!
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:37 AM
ఆంధ్రప్రదేశ్ 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) నివేదికను ఏడాదిలోపు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. పీఆర్‌సీ కొత్త చైర్మన్‌గా మాజీ సీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ను నియమిస్తూ ..
12వ పీఆర్‌సీ చైర్మన్‌కు రాష్ట్రప్రభుత్వం ఆదేశం
దినేశ్‌కుమార్ నియామకంపై ఉత్తర్వులు జారీ
అన్ని శాఖలూ కమిషన్ కోరిన సమాచారమివ్వాలని నిర్దేశం
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) నివేదికను ఏడాదిలోపు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. పీఆర్‌సీ కొత్త చైర్మన్‌గా మాజీ సీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులు, సర్వీసు నిబంధనల సమస్యలపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సిఫారసులతో ఆయన నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి 12వ పీఆర్‌సీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్‌సింగ్ 2023 జూలైలో నియమితులయ్యారు. ఆయన రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఇప్పుడు దినేశ్‌కుమార్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి కచ్చితంగా ఏడాదిలోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతుల స్వీకరణ, వాటి పరిశీలన, వివిధ శాఖల నుంచి సమాచార సేకరణకు కమిషన్ తన సొంత విధివిధానాలు రూపొందించుకోవచ్చు. సచివాలయ విభాగాలు, ప్రభుత్వ శాఖల అధిపతులు కమిషన్ కోరిన పూర్తి సమాచారాన్ని, అవసరమైన సహకారాలను తప్పనిసరిగా అందించాలి.
కమిషన్ పరిశీలించే అంశాలివీ..
ప్రస్తుత ద్రవ్యోల్బణం, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రాథమిక వేతన శ్రేణుల సవరణ.
ఇళ్ల అద్దె భత్యం, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు, ఇతర ప్రత్యేక అలవెన్సులను పునర్వ్యవస్థీకరణ.
రిటైర్డ్ ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్ల పెన్షన్ విధానాలు, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లెక్కింపుల సమీక్ష.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు