ఎన్నికల ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా పెంపు
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:56 AM
ఎన్నికల విధుల్లో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగులకు అందించే ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగులకు అందించే ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తుల హింసాత్మక చర్యల వల్ల మరణిస్తే ప్రభుత్వం రూ.30 లక్షల వరకూ ఇవ్వనుంది. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, వడదెబ్బ ఇతర ఆకస్మిక కారణాలతో మరణిస్తే రూ.15 లక్షలు, ప్రమాదాల వల్ల శాశ్వతంగా వికలాంగులైతే రూ.15 లక్షలు, పెద్ద ప్రమాదాల్లో గాయపడితే రూ.7.5 లక్షలను ఉద్యోగులకు నష్టపరిహారంగా అందించాలని నిర్ణయించింది.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు గౌరవ వేతనం, ఫుడ్ అలవెన్సులను కూడా ప్రభుత్వం పెంచింది. ఆదివారం జరిగే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈపెంపు అమల్లోకి వస్తుంది. డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులకు ఒక నెల జీతంలోని బేసిక్ పే కంటే తక్కువగా ఇస్తారు. గెజిటెడ్ ఆఫీసర్లకు 15 రోజులలోపు అయితే రూ.2 వేలు, 15 రోజులు దాటితే రూ.4 వేలు ఇవ్వనున్నారు. సబార్డినేట్ ఉద్యోగులకు 15 రోజుల కంటే తక్కువ రోజులు విధుల్లో ఉంటే రూ. 1500, 15 రోజులు దాటితే రూ.3 వేలు ఇస్తారు. అసిస్టెంట్ అబ్జర్వర్లు పూర్తిస్థాయి ఎన్నికల విధుల్లో ఉంటే రూ.10 వేల వరకూ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కౌంటింగ్ సూపర్‌వైజర్లకు ఫుడ్ అలవెన్సును రూ.350 నుంచి రూ.500లకు పెంచారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!