Share News

2004, 2005, 2006 అసైన్డ్‌ భూములకు ఫ్రీహోల్డ్‌ హక్కులు

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:21 AM

అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్‌ అమలులో రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023లో చేసిన చట్టసవరణ ప్రకారం 20 ఏళ్ల కాలపరిమితి దాటిన అసైన్డ్‌ భూములు ఉన్న రైతులు ఫ్రీహోల్డ్‌ కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని ..

2004, 2005, 2006 అసైన్డ్‌ భూములకు ఫ్రీహోల్డ్‌ హక్కులు

  • రైతులు, హక్కుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరించండి

  • జిల్లా కలెక్టర్లకు సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఆదేశాలు

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్‌ అమలులో రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023లో చేసిన చట్టసవరణ ప్రకారం 20 ఏళ్ల కాలపరిమితి దాటిన అసైన్డ్‌ భూములు ఉన్న రైతులు ఫ్రీహోల్డ్‌ కన్వర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలని జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి 26న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రభుత్వ స్థాయిలో అంటే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు వస్తాయని అధికార వర్గాలు భావించాయి.

అయితే, ఈ అంశంపై కలెక్టర్లకు సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు ఇచ్చారు. జీవో 596లో చేసిన సవరణ, ఆ తర్వాత ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 588 ప్రకారం... 2004, 2005, 2006 సంవత్సరాల్లో అసైన్‌మెంట్‌ అయున భూములు కూడా ఫ్రీహోల్డ్‌కు అర్హత సాధించాయని, వాటి ఫ్రీహోల్డ్‌ కన్వర్షన్‌ కోసం సంబంధిత రైతులు, హక్కుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కరించాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. ఈ మేరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు పౌరసేవల్లో దరఖాస్తుల స్వీకరణకు వెసులుబాటు కల్పించాలని, సబ్‌కలెక్టర్‌-ఆర్డీవో, తహశీల్దార్‌ లాగిన్‌ల ద్వారా ఆ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఫ్రీహోల్డ్‌ కోసం జిల్లా కలెక్టర్లు మరోసారి ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 04:21 AM