Share News

మీ భూమి.. మా పరిష్కారం!

ABN , Publish Date - Sep 21 , 2026 | 03:21 AM

తరాలు గడచినా పరిష్కారం కాని భూ వివాదాలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలతో నివేదికలు పంపాలంటూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు సత్ఫలితాలిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 చోట్ల బల్క్‌ ల్యాండ్‌ వివాదాలు తన దృష్టికి రాగా..

మీ భూమి..   మా పరిష్కారం!

  • బల్క్‌ ల్యాండ్‌ సమస్యలపై ప్రభుత్వం దృష్టి

  • దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలపై ఆరా

  • ఇప్పటికే 72 చోట్ల వివాదాల గుర్తింపు

  • ఎనిమిది రకాలుగా సమస్యల వర్గీకరణ

  • ప్రతి నెలా ఒక జిల్లాలో ‘విముక్తి’

  • కేటగిరీలవారీగా నివేదికలు, రికార్డులుపంపాలని కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశాలు

  • జిల్లాలకు చెక్‌లిస్టు పంపిన రెవెన్యూ శాఖ

తరాలు గడచినా పరిష్కారం కాని భూ వివాదాలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలతో నివేదికలు పంపాలంటూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు సత్ఫలితాలిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 చోట్ల బల్క్‌ ల్యాండ్‌ వివాదాలు తన దృష్టికి రాగా.. వాటిన్నిటికీ పరిష్కారం చూపిస్తూ ఒక్కో నెలలో ఒక్కో జిల్లాలో ఈ విముక్తి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూవివాదాల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా క్లిష్టమైన 232 భూ వివాదాలను పరిష్కరించింది. దీనివల్ల 1,18,799 సామాన్య, పేద రైతు కుటుంబాలు లబ్ధిపొందాయి. గరిష్ఠంగా 31,827 ఎకరాల భూమిపై పేదలకే హక్కులు దక్కేలా గత 25 నెలల కాలంలో చర్యలు చేపట్టింది. రెవెన్యూ శాఖ అధికారిక అంచనాల ప్రకారం.. పేదలకు మేలు చేసిన భూముల విముక్తి విలువ రూ.5,014 కోట్లు. అయితే జిల్లాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నప్పుడు ప్రజలు, బాధితులు అనేక రకాల భూసమస్యలను ఆయన ఎదుట ఏకరువు పెడుతున్నారు.


ఇటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, సీఎస్‌ జి.సాయిప్రసాద్‌, సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి, జిల్లాల కలెక్టర్ల దృష్టికీ అనేక భూ వివాదాలు వస్తున్నాయి. అందులో దశాబ్దాల నాటి వివాదాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు, కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లకు పరిష్కారం కోసం రైతుల భూ వివాదాలు వస్తున్నాయి. ఇందులో వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, కోర్టు కేసులను మినహాయిస్తే.. తమ యంత్రాంగం దృష్టిపెడితే పరిష్కారమయ్యే సమస్యలు చాలానే ఉన్నాయని రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ నెల 17-18 తేదీల్లో అమరావతిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్లు, సబ్‌కలెక్టర్లు, ఆర్‌డీవోలు, సర్వే, సెటిల్మెంట్‌ అధికారుల వర్క్‌షాప్‌ జరిగింది. ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూ వివాదాల పరిష్కారమే దీని అజెండా. భూ వివాదాలు, సమస్యలను ఎనిమిది రకాలుగా రెవెన్యూ శాఖ వర్గీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వివిధ రకాల వివాదాలు 72 చోట్ల ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.

8వివాదాల వర్గీకరణ ఇలా..

1. ల్యాండ్‌ క్లాసిఫికేషన్‌ (భూమి స్వభావం) మార్పు: ఇందులోనే చెరువు శిఖం, చెరువు పోరంబోకు, ప్రభుత్వానికి అభ్యంతరం ఉన్న భూములున్నాయి. ఈ కేటగిరీలో గుంటూరు, ఎన్టీఆర్‌, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో సగటున రెండు చొప్పున మొత్తం 10 అంశాలను గుర్తించారు. కర్నూలులో 5, ప్రకాశం-3, అన్నమయ్య, చిత్తూరు, నంద్యాల, పల్నాడు, నెల్లూరు, సత్యసాయి, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ తరహా సమస్యలు ఉన్నాయి.

2. . సెటిల్మెంట్‌ కాని భూములు: సెటిల్మెంట్‌ కాని ఇనాం, ఎస్టేట్‌, సర్వీసు ఇనాం, వక్ఫ్‌, దేవదాయ భూములు. ఈ తరహా భూములు ఎన్టీఆర్‌, పోలవరం, విజయనగరం, పశ్చిమ గోదావరిల్లో రెండు చొప్పున.. ప్రకాశం-11, కర్నూలు-5, అన్నమయ్య, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో సగటున ఒక్కొక్కటి ఉన్నాయి.


3. గ్రౌండ్‌ రెంట్‌ పట్టాల క్రమబద్ధీకరణ: పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ సమస్యలున్నాయి, ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. కృష్ణా జిల్లాలోని అంశాలపై కలెక్టర్‌ నుంచి నివేదిక కోరింది.

4. 1954కుముందు ఉన్న అసైన్డ్‌ భూములు, ఇంకా అభ్యంతరకరమైన భూముల క్రమబద్ధీకరణ: ప్రభుత్వం ఇప్పటికే 1954కు ముందు అసైన్డ్‌ అయిన భూములకు పరిష్కారం చూపింది. అయినా అనేక జిల్లాల్లో ఈ సమస్యను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పరిష్కరించడం లేదు. ఇక ప్రభుత్వానికి అభ్యంతరం ఉన్న భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని.. వాటి క్రమబద్ధీకరణ కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. ఈ సమస్య ఏలూరు, ఎన్టీఆర్‌, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తీవ్రంగా ఉంది. ప్రకాశంలో 9, బాపట్ల-2, అన్నమయ్య, చిత్తూరు, పల్నాడు, సత్యసాయి, కడప జిల్లాల్లోనూ ఈ తరహా సమస్యలు గుర్తించారు.

5. నిషేధ జాబితా నుంచి భూముల తొలగింపు: ఇప్పటికే ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌పై నిర్ణయం తీసుకుంది. పట్టా భూములను నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. అక్టోబరు నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని రెవెన్యూ శాఖ కూడా చూస్తున్న సీఎస్‌ సాయిప్రసాద్‌ ఆదేశించారు. అధికారిక లెక్కల ప్రకారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సగటున రెండు, శ్రీకాకుళంలో ఒక సమస్య ఉన్నట్లుగా గుర్తించారు. కర్నూలులో 4, ప్రకాశం-4, పల్నాడు-2. తిరుపతి-2, సత్యసాయి జిల్లాలో ఒక సమస్య ఉన్నాయి.

6. ఉచితంగా లేదా మార్కెట్‌ విలువకు భూములు కేటాయించినవి, ఇంకా ఇంటిస్థలాలు: వీటిని నిషేధ జాబితా నుంచి తొలగించడం కీలకమైన సమస్య. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఈ సమస్య ఉన్నట్లు కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. ఈ కేటగిరీలో ప్రకాశంలో 6, చిత్తూరులో 2 సమస్యలున్నాయి.

7. గయాళు భూసమస్య. ఇది అనకాపల్లి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా పరిధిలో ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రకాశంలో 7, చిత్తూరు-2, కర్నూలు, నెల్లూరు, సత్యసాయి జిల్లాల్లో ఈ కేటగిరీ సమస్యలున్నాయి.


8. ఏపీఐఐసీ పరిధిలో ఉన్న భూములు, గ్రామ సరిహద్దులను విస్తరించడం ద్వారా పరిష్కారమయ్యేవి.. రీ సర్వేతో సెటిల్‌ అయ్యేవి.. ఫారెస్ట్‌ భూముల డీ-నోటిఫికేషన్‌తో పరిష్కారం పొందేవి: రెవెన్యూ రికార్డుల్లో సాంకేతికంగా జరిగిన పొరపాట్లు, రికార్డుల్లో గ్రామం డేటాను నమోదుచేయకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. గ్రామ సరిహద్దులు విస్తరించడం, రీ సర్వేతో పరిష్కారం అయ్యే భూములు పశ్చిమగోదావరిలో ఉన్నట్లుగా నిర్ధారించారు. అటవీ భూమి కాదని డీనోటిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా పరిష్కారమయ్యే సమస్యలు పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో రెండేసి.. నెల్లూరులో ఒక సమస్య ఉన్నట్లు గుర్తించారు. రికార్డుల్లో సాంకేతిక పొరపాట్లు, అక్షర దోషాలు.. గ్రామాల డేటానే నమోదు చేయకపోవడం వల్ల అల్లూరి సీతారామరాజు జిల్లాలో సమస్యలు ఉత్పన్నమైనట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో గర్భకండ్రిక, ఇనాం పోరంబోకు భూముల వివాదాలు ఆరు వరకు ఉన్నాయి.


లోతైన అధ్యయనం చేయాలి..

ప్రజలు, రైతులు, నివాసితులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక భూ సమస్యలను ఇప్పటికే గుర్తించినందున వాటిపై లోతైన అధ్యయనం చేసి నివేదికలు పంపించాలని కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు. భూ వివాదం నేపథ్యం, చరిత్ర, విస్తీర్ణం, భూమి మార్కెట్‌ విలువ, న్యాయ, సాంకేతిక అంశాలు తొలి జాబితాలో.. భూ వివాదాల పరిష్కారానికి బలం చేకూర్చే సపోర్టింగ్‌ రికార్డులు రెండో జాబితాలో చేర్చి పంపించాలని స్పష్టంచేశారు. ఇందులో గ్రామ మ్యాప్‌, అడంగల్‌, ఆర్‌ఎస్ఆర్‌, ఎఫ్‌ఎమ్‌బీ స్కేచ్‌, సంబంధిత ఈసీ, ఆర్‌హెచ్‌లు ఉండాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలపై ఏం చేయాలి.. ఎలాంటి నివేదికలు ఇవ్వాలో కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం దృష్టికి రానివి, ప్రజా ప్రతినిధుల పరిశీలనకు వెళ్లిన భూ సమస్యలేమిటో తెలుసుకుని వాటి పరిష్కారానికీ నివేదికలు పంపించాలని సీఎస్‌ ఆదేశించారు. ఈ విషయంలో కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కోర్టు కేసుల్లో ఉన్నవి మినహా పరిష్కారమయ్యేందుకు పక్కాగా నివేదికలు పంపించాలని స్పష్టం చేశారు. సీసీఎల్‌ఏలో జరిగిన రెండ్రోజుల వర్క్‌షాప్‌లోనూ ఇవే ఆదేశాలిచ్చారు. ప్రతి నెలా సీఎం చేతులమీదుగా ప్రధాన భూ సమస్యకు రెవెన్యూశాఖ పరిష్కారం చూపుతున్న సంగతి తెలిసిందే. అవసరమైతే నెలలో రెండు సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా అంశాలను గుర్తించి, పరిష్కారాలు కనిపెట్టాలని అధికారులను ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 03:21 AM