తీరం.. మురుగుమయం
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:49 AM
సువిశాల తీరం... సంద్రం నుంచి ఎగసిపడే అలలు... తెల్లని ఇసుక, చల్లని గాలి... సందర్శకులను కట్టిపడేసే బీచ్‌లకు ఆలవాలం విశాఖపట్నం. సాయంత్రం సేదతీరేందుకు నగరవాసులు కూడా ఎంచుకునే మొదటి ప్రదేశం.
సముద్రంలోకి నేరుగా మురుగు జలాలు
యథేచ్ఛగా కలుస్తున్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు
కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడమే కారణం
ఎన్జీటీకి విశ్రాంత నేవీ ఉన్నతాధికారుల ఫిర్యాదు
మూడు నెలల క్రితమే జీవీఎంసీకి పీసీబీ నోటీసు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
సువిశాల తీరం... సంద్రం నుంచి ఎగసిపడే అలలు... తెల్లని ఇసుక, చల్లని గాలి... సందర్శకులను కట్టిపడేసే బీచ్‌లకు ఆలవాలం విశాఖపట్నం. సాయంత్రం సేదతీరేందుకు నగరవాసులు కూడా ఎంచుకునే మొదటి ప్రదేశం. కాలువల ద్వారా మురుగునీరు నేరుగా సముద్రంలో చేరడం... ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం... తీవ్రమైన దుర్గంధం... ప్రస్తుతం తీరంలో గోచరించే దృశ్యాలివి... అధికారుల నిర్లక్ష్యం, మురుగునీటి శుద్ధిపై దృష్టిసారించకపోవడం, నగర ప్రజల్లో అవగాహన లోపంతో తీరం కాలుష్య కాసారంగా మారుతోంది. ఫలింగా తెల్లని ఇసుకరాశులు నల్లని రంగును అద్డుకుని కళావిహీనంగా కనిపిస్తున్నాయి. పర్యాటకలుఉ ముక్కుమూసుకుని బీచ్‌లో గడపాల్సిన దుస్థితి ఎదురవుతోంది.
నగరంలోని పలు ప్రాంతాల నుంచి కాలువల ద్వారా ప్రవహించే మురుగునీరు నేరుగా సముద్రంలో కలుస్తోంది. ఉత్తరాన భీమిలి నుంచి దక్షిణ పోర్టు ఏరియాలో హార్బర్ రోడ్డు వరకు పలుచోట్ల కాలువల ద్వారా మురుగునీరు నేరుగా సంద్రంలో చేరుతోంది. వర్షాకాలంలో కాలువల నుంచి వ్యర్థాలతో కూడిన నల్లని మురుగు కలవడంపై నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు ఉన్నతాధికారులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో జీవీఎంసీ, కాలుష్య నియంత్రణమండలి అధికారులకు ఎన్జీటీ నోటీసులు జారీచేసింది.
నగరంలో అన్ని ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 250 ఎంఎల్‌డీ మురుగునీరు వెలువడుతోంది. అప్పుఘర్, వన్‌టౌన్‌లోని లక్ష్మీటాకీస్, నరవ, ముడసర్లోవ తదితర ప్రాంతాల్లోని మురుగునీటి శుద్ధి ప్లాంల్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 170 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధిచేస్తున్నారు. మరో 80 ఎంఎల్‌డీల మురుగునీరు కాలువల ద్వారా నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భౌగోళికంగా ఉన్న ఇబ్బందులతో నగరం నుంచి బీచ్‌రోడ్డు మీదుగా కాలువల ద్వారా వచ్చే మురుగునీటి శుద్ధిచేయడం కష్టసాధ్యమైన పనిగా కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ నీటిని లిఫ్ట్‌ల ద్వారా మురుగుశుద్ధి ప్లాంట్లకు పంపింగ్‌చేసే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా మురుగుకాలువల ద్వారా మురుగుతోపాటు ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలుస్తుండడంతో తీరంలో రెండుమూడు కిలోమీటర్ల వరకు ప్లాస్టిక్ గుట్టలు ఏర్పడ్డాయి. ఐదారుకిలోమీటర్ల వరకు సముద్రంలో నీటి స్వచ్ఛత తగ్గిందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
కంపుకొడుతున్న తీరం
ముఖ్యంగా బీచ్‌లో జనసంచారం ఎక్కువగా ఉండడంతో బీచ్‌రోడ్డు గుండా ప్రవహించే మురుగునీరు సముద్రంలో కలుస్తుండడంతో నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆర్కేబీచ్, సాగర్‌నగర్, లాసన్స్‌బేకాలనీ, వన్‌టౌన్‌లో పలుచోట్ల, చేపలుప్పాడ వద్ద ఎక్కువగా మురుగునీరు సముద్రంలోకి ప్రవేశించడంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వ్యాపిస్తోంది. సముద్రంలో మత్స్య సంపద, ఇతర జీవరాశుల మనుగడకు ముప్పు ఎదురవుతోంది. బీచ్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న మురుగు కాలువలను జీవీఎంసీ అధికారులు సరిగా నిర్వహించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేవీ విశ్రాంత అధికారులు ఎన్జీటీకి ఫిర్యాదుచేశారు.
నోటీసులిచ్చిన పీసీబీ
సముద్రంలోకి నేరుగా మురుగునీరు విడిచిపెట్టడంపై కాలుష్య నియంత్రణ మండలి మూడు నెలల క్రితమే జీవీఎంసీకి నోటీసు జారీచేసింది. పోర్టు నుంచి మంగమారిపేట వరకు, రుషికొండ, సాగర్‌నగర్, జోడుగుళ్లపాలెం, లాసన్స్‌బేకాలనీ, వుడా పార్కు సమీపంలోని జాలారిపేట, ఆర్కేబీచ్, నోవాటెల్, ఫిషింగ్ హార్బర్, హార్బర్ రోడ్డు వరకు మురుగుకాల్వల నుంచి నీటిని సేకరించిన పీసీబీ అధికారులు ల్యాబ్‌లో విశ్లేషించారు. ఆ నీటిలో పరిమితికి మించి కాలుష్యం ఉందని గుర్తించిన అనంతరం జీవీఎంసీకి నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా ఎన్జీటీకి నేవీ అధికారులు ఫిర్యాదుచేయడంతో మురుగునీటి శుద్ధిపై జీవీఎంసీ, పీసీబీ కౌంటర్ దాఖలు చేసేందుకు నిర్ణయించాయి.