మైదాతో ముప్పే.!
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:46 AM
ఉదయం లేచింది మొదలు... రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు అనేక ఆహారపదార్థాల్లో మైదా తప్పనిసరి అవుతోంది.
అధికంగా తీసుకోవడం అనారోగ్య కారకం
ఫైబర్ తక్కువగా ఉండడంతో జీర్ణక్రియపై ప్రభావం
మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం
మహిళల్లో రొమ్ము సమస్యలకు దోహదం
దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం
విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
ఉదయం లేచింది మొదలు... రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు అనేక ఆహారపదార్థాల్లో మైదా తప్పనిసరి అవుతోంది. అంతేకాదు దీంతో తయారుచేసే పదార్థాలను ఆరగించేందుకు ఆసక్తిచూపేవారి సంఖ్యా ఎక్కువే. మైదాతో చేసే పదార్థాలను అతిగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహారంలో భాగంగా ప్రతిరోజూ మైసూర్ బజ్జీ, పుణుగులు, సమోసాలు తదితర మైదాతో చేసే ఆహారపదార్థాలు తింటున్న వారిని అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉందని ఆహార భద్రత, ప్రమాణాలశాఖ అధికారులు చెబుతున్నారు. వీలైనంత వరకు వీటిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా మైదా గోధుమల నుంచి ఉత్పత్తి అవుతుంది. అయితే దానిని మరింత తెల్లగా, నిల్వ ఉండేలా చేయడం కోసం రసాయనాలను మిళితం చేస్తారు. ఫలితంగా అది అనారోగ్య కారకంగా మారుతోందని చెబుతున్నారు.
మైదా.. తయారయ్యేదిలా...
గోధుములను పిండిచేసేందుకు వీలుగా మిల్లింగ్ చేసే సందర్భంగా బాగా పాలిష్‌చేసి సూక్ష్మ జల్లెడ ద్వారా బయటిపొట్టు, జెర్మ్ భాగాలను వేరుచేస్తారు. వేరేచేసిన భాగాలతో మైదాను తయారుచేస్తారు. అయితే ఈ పిండి పసుపురంగులో ఉంటుంది. దీనిని తెల్లగా చేయడానికి కొన్నిరకాల రసాయనాలను, చివరిదశలో పొటాషియం బ్రోమాట్, అల్లాక్సన్ వంటి కెమికల్స్ జోడిస్తారు. గతంతో పోలిస్తే మైదాతో చేసిన ఆహార పదార్థాల వినియోగం గణనీయంగా పెరిగింది. మైసూరు బజ్జీ, పుణుగులు, సమోసాలు, పరోటా, బ్రెడ్, బన్, కేక్, రోటీ, పిజ్జా, బర్గర్, జిలేబీ, కాజా, హల్వా వంటి అనేక రుచికరమైన వంటకా లను తయారుచేస్తున్నారు. వీటిని అధికంగా తీసుకునేవారు వ్యాధులకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఈ సమస్యలకు అవకాశం..
మైదాతో చేసే ఆహార పదార్థాలను అధికంగా తినేవారిలో జీర్ణ సంబంధిత సమస్యలు (గ్యాస్ర్టిక్, అల్సర్స్, మలబద్దకం) వేధిస్తుంటాయి. మధుమేహం, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, కిడ్నీలో రాళ్లు, ఊబకాయం (బరువు పెరగడం), మహిళలో రొమ్ము సంబంఽధిత సమస్యలు, దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అనేక దేశాల్లో నిషేధం..
పొటాషియం బ్రొమేట్, క్లోరిన్, బెంజాయిక్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను యూరోప్ దేశాలు, అమెరికా నిషేధించాయి. 2016లో మద్రాస్ హైకోర్టులో మైదాలో విషపూరిత కెమికల్ వాడకంపై పిటిషిన్ దాఖలు చేయగా, ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా మైదాతో చేసే ఆహార ఉత్పత్తుల్లో ఈ తరహా కెమికల్స్ వినియోగిస్తుండడమే ప్రమాదమంటున్నారు. మైదాకు ప్రత్నామ్నాయంగా గోధుమలు, జొన్న, రాగి వంటి పిండి పదార్థాలను వినియోగించాలని సూచిస్తున్నారు.
ఇలా చేస్తే మేలు...
వీలైనంత వరకు బేకరీ, ఫాస్ట్‌ఫుడ్, చైనీస్ వంటకాలను తగ్గించాలి. మైదాలో ఫైబర్ ఉండదు. గోధుమల్లో అధికంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు మైదాలో తక్కువగా, గోధుమ పిండిలో పుష్కలంగా లభిస్తాయి. గ్లైసీమిక్ ఇండెక్స్ మైదాలో అధికంగా ఉంటుంది. మైదా వినియోగించడం వల్ల ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రయోజనం ఉండదు.
వీలైనంత వరకు తగ్గించాలి
మైదా వినియోగంతో నష్టాలే ఎక్కువ. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మైదా వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మైదాతో తయారు చేసే ఆహార పదార్థాలను చిన్న వయసు నుంచే తీసుకునే వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. దీనివల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రోజువారీ ఆహారంలో మైదా లేకుండా చూసుకుంటే ఆరోగ్యకరమైన జీవనానికి వీలుంటుంది. ప్రతిరోజూ మైదాతో చేసిన ఆహార పదార్థాలు తినేవారిలో జీర్ణ సమస్యలు ఎక్కువవుతాయి.
- ఎస్.కల్యాణ చక్రవర్తి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి