‘తారు’ తెచ్చుకోండి
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:13 AM
అంతర్జాతీయంగా , పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా తలెత్తిన తారు (బిట్‌మెన్) ధరల సంక్షోభాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది
విదేశీ దిగుమతులకు ప్రభుత్వం ఓకే
ప్రైవేట్ సేకరణకూ కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు అనుమతి.. యుద్ధంతో పెరిగిన ధరలతో తగ్గిన సరఫరా
తారు కొరతతో ఆగిన ఆర్‌అండ్ బీ వర్క్స్.. సమస్య నివృత్తికి ముందుకొచ్చిన మంత్రి
విదేశీ దిగుమతికి అనుమతించడంతోపాటు పాత ఒప్పందాల సవరణకూ సిద్ధం..మెమో జారీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయంగా , పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా తలెత్తిన తారు (బిట్‌మెన్) ధరల సంక్షోభాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రహదారి పనులను చేపట్టేందుకు అవసరమైన తారును అవసరమైతే విదేశాల నుంచీ దిగుమతి చేసుకునేందుకు, ఇంకా ప్రైవేటు రంగంలో కూడా కొనుగోలు చేసేందుకు రోడ్లు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ)కు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి లేదా తారు ధరలు అందుబాటులోకి వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీకి అనుమతి ఇస్తూ ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తాజాగా మెమో జారీ చేశారు.
ఇదీ నేపథ్యం..
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తోన్న యుద్ధ ప్రభావం వల్ల ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, బిట్‌మెన్(తారు) వంటి వాటి ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. తారు ధరల పెరుగుదల ప్రభావం రహదారులపై పడింది. రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం పెరిగిన బిట్ మెన్ ధరలను కాంట్రాక్టర్లు భరించలేకపోతున్నారు. సహజంగా రహదారి వర్క్‌లకోసం ముడి చమురునుంచి తీసే తారుకు సంబంధించి వీజీ-10, వీజీ-30, వీజీ-40 రకాలు వాడుతుంటారు. యుద్ధం కారణంగా పెరిగిన ధరలతో ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లు కూడా నిర్దేశిత ధరలకు తారును అందించలేకపోతున్నాయి. వాటికి కూడా సరఫరా తగ్గిపోవడంతో ధాని ధరను విపరీతంగా పెంచాయి.
ఫలితంగా రహదారులకు అవసరమైన బిటుమినస్ మకడ్డమ్(బీసీ), సెమీ డెన్స్ బిట్‌మినస్ కాంక్రీట్(ఎస్‌డీబీసీ), డెన్స్ బిట్‌మినస్ మకడ్డమ్ (డీబీఎమ్), బిట్‌మినస్ కాంక్రీట్(బీసీ), మిక్స్‌డ్‌సీల్ సర్ఫేసింగ్ (ఎంఎస్‌ఎస్)లు ధరలు పెరగడం, అవి ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పనులకు నిర్దేశిత ధరల్లో అందుబాటులో లేకపోవడంతో రహదారి పనులు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. వెంటనే పరిష్కరించేందుకు విదేశీ దిగుమతి, ప్రైవేటు కొనుగోలుకు అనుమతి ఇవ్వడంతోపాటు ధరల సర్దుబాటు చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.
దిగుమతికి క మిటీ సిఫారసు
అమెరికా-ఇరాన్ యుద్ధం శాంతించి పరిస్థితులు చక్కబడుతాయేమోనని ప్రభుత్వం, కేంద్ర సంస్థలు ఇంతకాలం ఎదురు చూశాయి. అయితే, పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, మరోవైపు రహదారి ప్రాజెక్టులు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది రహదారి వర్క్‌లు చేసే ఏజెన్సీలు, కాంట్రాక్టర్లకు విదేశీ తారు దిగుమతికి అనుమతి ఇవ్వడంతోపాటు, ప్రైవేటు తారు కొనుగోలుకు అవకాశం కల్పించాలని, ఈ మేరకు ముందుగా జరిగిన రహదారి నిర్మాణ ఒప్పందాలను పెరిగిన తారు ధరల ఆధారంగా సర్దుబాటు (ప్రైస్ అడ్జ్‌స్టమెంట్) చేయాలని ఈఎన్‌సీ, చీఫ్ ఇంజనీర్ల కమిటీ ఇటీవల సమావేశమై తీర్మానించి ప్రభుత్వానికి నివేదించింది.
ఫలించిన మంత్రి చర్చలు
కమిటీ సిఫారసు మేరకు విదేశీ తారు దిగుమతికి అనుమతి ఇస్తేనే రహదారి పనులు ముందుకు సాగే పరిస్థితి ఉందని, సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి.. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. ఆర్థిక శాఖతోనూ చర్చలు జరిపినట్లు తెలిసింది. వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంత్రి వినతి మేరకు ఈ విషయాల్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ వెసులుబాటు వచ్చే ఏడాది మార్చి 31 లేదా, చమురు రంగంలో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ఉంటుందని కార్యదర్శి ఇచ్చిన మెమోలో పేర్కొన్నారు. పనుల ధరల సర్దుబాటు 2021లో జారీ చేసిన జీవో 62 ప్రకారం జరగాలని, అనుమతి ఇచ్చామనే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల కంటే ఎక్కువ ధరలు పెట్టి దిగుమతి చేసుకోవద్దని, ప్రైవేటు కొనుగోళ్లు చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే, ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లు ఏ ధరలను అనుసరిస్తున్నాయో చూసుకొని అందుకు తగినట్టే కొనుగోళ్లు ఉండాలని స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి: