రారండోయ్..!
ABN , Publish Date - Nov 12 , 2026 | 04:54 AM
విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
ప్రపంచానికి ఆంధ్రా పిలుపు
ముఖ్య అతిథులుగా అమిత్ షా, కేంద్ర మంత్రులు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరు
పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యాలకు కేంద్రంగా ఏపీని నిలపడమే ధ్యేయం
నేవిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్
థీమ్‌తో రెండు రోజుల పాటు 6 అంశాలపై చర్చలు
141 ఒప్పందాలతో 12.14 లక్షల కోట్ల పెట్టుబడులు
2.46 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం
ప్రధాన ప్లీనరీ హాల్, పారిశ్రామికవేత్తల చర్చలకు ప్రత్యేకంగా సమావేశ ప్రాంగణాలు
ఒకరోజు ముందే విశాఖకు చంద్రబాబు, లోకేశ్
జపాన్ రాయబారి, యూఏఈ మంత్రితో సీఎం భేటీ
అమరావతి/విశాఖపట్నం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడుల జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సదస్సులో 141 ఒప్పందాల ద్వారా రూ.12,13,853 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటికి సంబంధించి ఇదే వేదికపై మొత్తం 30 జీవోలు అక్కడికక్కడే జారీ చేయనున్నారు. ఈ సంస్థల ద్వారా 2,46,373 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ‘మారుతున్న ప్రపంచ సమీకరణాలతో వాణిజ్యం, సాంకేతికత, నమ్మకం, ఆలోచనా నాయకత్వంతో ముందుకు సాగడం’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయుష్ గోయల్, శర్బానంద సోనోవాల్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రతినిధులు, 16 దేశాలకు చెందిన మంత్రులు, 40 మంది అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు పాల్గొననున్నారు. శుక్రవారం ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరవుతారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సమాంతరంగా ఏపీ ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్-2026 జరుగుతుంది. దీనికి మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. మహిళా సాధికారత, పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం, ఆర్థిక వృద్ధిపై ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానంపై దృష్టి సారించనున్నారు. ప్రధాన సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ప్రాంతీయ సన్నాహక పెట్టుబడుల సదస్సుల నిర్వహించారు. వీటి ద్వారా రూ. 86,522 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి.
12, 13వ తేదీల్లో జరిగే ప్రధాన సదస్సులో సుమారు 400కు పైగా బిజినెస్ సమావేశాలు జరుగుతాయి. ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థల మధ్య బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలతో పాటు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో విస్తృత చర్చలు ఉంటాయి. ప్రపంచ మార్కెట్లతో ఏపీ పరిశ్రమలను అనుసంధానించేందుకు కీలక ఒప్పందాలు జరుగుతాయి. సదస్సులో పాల్గొనడానికి సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ ఒకరోజు ముందుగానే బుధవారంనాడే విశాఖకు విచ్చేశారు. అంతకు ముందు అమరావతిలో సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు