పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు.. స్టీల్ ప్లాంట్‌కు రేపు భూమి పూజ..
ABN , Publish Date - Mar 22 , 2026 | 08:39 PM
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు రేపు(సోమవారం) భూమి పూజ జరగనుంది. కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
అమరావతి, మార్చి 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి మరో ముందడుగు పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు రేపు(సోమవారం) భూమి పూజ జరగనుంది. కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. రేపు మధ్యాహ్నం నేరుగా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఎక్స్‌పీరియన్స్ జోన్ సందర్శించటంతో పాటు ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్‌ను పరిశీలిస్తారు.
అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి శంకుస్థాపన ఫలకం ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ భూమి పూజకు ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నారాయణ మిట్టల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు వస్తున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి..
సుమారు 1,35,964 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటి విశేషం. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ సంస్థలు ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ సంస్థలు అత్యంత ఆధునికమైన, పర్యావరణహితమైన సాంకేతికతను ఇక్కడ ఉపయోగించనున్నాయి.
ఇవి కూడా చదవండి
వాట్సాప్ కంటే హైప్డ్ సంవాదినీ చాలా మంచి యాప్: అనువాదిని సంస్థ సీఈఓ
నిరుపేదను ఆదుకోవాలన్న సంకల్పంతోటే జీవిత భీమా: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క