Share News

టేకు మొక్కల్లో మెరుగైన క్లోన్ల సృష్టి

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:11 AM

రాష్ట్ర అటవీశాఖ అరుదైన ఘనత సాధించింది. నిరంతర పరిశోధనలతో టేకు మొక్క ల్లో మూడు మెరుగైన క్లోన్లను అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

టేకు మొక్కల్లో మెరుగైన క్లోన్ల సృష్టి

  • రాష్ట్ర అటవీ శాఖ అరుదైన ఘనత.. వేగంగా, ఏపుగా పెరిగే మూడు టేకు క్లోన్లు అభివృద్ధి

  • ఏపీఎఫ్‌డీ-ఐడబ్ల్యూఎస్‌టీ -టీజీ-1, 2, 3 పేరిట విడుదల

  • అధికారులు, శాస్త్రవేత్తలకు డిప్యూటీ సీఎం పవన్‌ అభినందనలు

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అటవీశాఖ అరుదైన ఘనత సాధించింది. నిరంతర పరిశోధనలతో టేకు మొక్క ల్లో మూడు మెరుగైన క్లోన్లను అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దేశంలోనే తొలిసారిగా బెంగుళూరులోని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌-ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఉడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ (ఐసీఎఫ్ఆర్‌ఈ -ఐడబ్ల్యూఎస్‌టీ)తో సంయుక్తంగా పరిశోధనలు చేసి ఏపీఎఫ్‌డీ- ఐడబ్ల్యూఎస్‌టీ-టీజీ-1, 2, 3 పేర్లతో మూడు మెరుగైన క్లోన్లను సృష్టించింది. దాదాపు ఐదున్నర దశాబ్దాల పరిశోధన, మొక్కల ఎంపిక, క్షేత్రస్థాయి పరీక్షలు, శాస్త్రీయ మదింపు ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ టేకు క్లోన్లను వెరైటీ టెస్టింగ్‌ అండ్‌ రిలీజ్‌ విధానంలో విడుదల చేసేందుకు ఐసీఎఫ్‌ఆర్‌ ఈ ఆమోదం తెలిపింది. ఏపీఎఫ్‌డీ-ఐడబ్ల్యూఎస్‌టీ-టీజీ-1ను నర్సీపట్పం అటవీ ప్రాంతంలోని గుడిమర్రిపాకలలో అభివృద్ధి చేశారు.

అటవీశాఖ అధికారులు శుక్రవారం ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన పవన్‌... అరుదైన ఘనత సాధించిన అటవీశాఖ పరిశోధన విభాగం, పీసీసీఎఫ్‌, పరిశోధకులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఐసీఎఫ్‌ఆర్‌ఈ-ఐడబ్ల్యూఎ్‌సటీ శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. ఈ మెరుగైన టేకు మొక్కలు భవిష్యత్‌లో కలప ఉత్పాదకత పెంపుదలకు, రైతు లు, టేకు పెంపకందారులకు ప్రయోజనం చేకూర్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ మెరుగైన జన్యు రకాలు తక్కువ సమయంలోనే వేగంగా, ఏపుగా పెరిగి రైతులకు, అటవీ విభాగాలకు అధిక దిగుబడిని అందిస్తాయని అధికారులు తెలిపారు.


ఎర్రచందనం దొంగల్లో వణుకు పుట్టాలి: పవన్‌కల్యాణ్‌

ఎర్రచందనం దుంగల వైపు చూడాలంటేనే దొంగలకు వెన్నులో వణుకు పుట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. అక్రమ రవాణా ముఠాలకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోయేలా ఆపరేషన్లు నిర్వహించాలని యాంటీ రెడ్‌ శాండర్స్‌ టాస్క్‌ఫోర్స్‌, అటవీశాఖ అధికారులకు సూచించారు. కడప జిల్లాలో శుక్రవారం అటవీశాఖ అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 114 దుంగలు, ఏడు వాహనాలను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ల మూలాలను తెలుసుకునే విధంగా దర్యాప్తు సాగాలని అధికారులను పవన్‌ ఆదేశించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

అటవీశాఖలో 56 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) రాష్ట్ర అటవీశాఖలో 56 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌ యాక్టు-2023 ప్రకారం క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ షరతులకు లోబడి రెగ్యులర్‌ పోస్టులను ఈ కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో భర్తీ చేసేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:18 AM