ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి జోష్!
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:42 AM
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మొత్తం రూ.1,388 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామంలో 40.50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది.
భారీగా పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. రేవాక్స్ అగ్రిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మొత్తం రూ.1,388 కోట్ల పెట్టుబడితో చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామంలో 40.50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,000 మందికి ప్రత్యక్షంగా, మరో 3వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.592.22కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, క్లియరెన్స్‌లు త్వరితగతిన అందించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఫుడ్ ప్రాసెసింగ్) చిరంజీవి చౌదరి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్‌లో కొత్త బేవరేజెస్ తయారీ యూనిట్ ఏర్పాటుతో పాటు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇప్పటికే ఉన్న యూనిట్‌ను విస్తరించనుంది. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.1,127 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రాజెక్టులకు రూ.409.59 కోట్ల విలువైన ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.
ఎపిటోమ్ ఇండస్ట్రీస్ ఇండియా సంస్థ రూ.530.65 కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం ఈపూరు గ్రామంలోని 15ఎకరాల సొంత స్థలంలో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు రూ.185.09 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించారు. కెల్లాగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తిరుపతి జిల్లా శ్రీసిటీలోని మ్యూస్లీ, మల్టీగ్రేన్ చాకోస్ ప్లాంట్‌ను విస్తరించడానికి గాను రూ.211.70 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం రూ.60.99కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. నెల్లూరు జిల్లాలోని రమణాయుడుపల్లి, చినమాచనూరు, రాజవోలు గ్రామాల్లో రూ.222.63 కోట్ల పెట్టుబడితో సమగ్ర కోళ్ల పెంపకం, గుడ్ల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు శ్రీ వైభవ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం రూ.42.11 కోట్ల వరకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు