Share News

జీఎస్టీలో అరెస్టులు వద్దు

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:14 AM

జీఎస్టీ చట్టంలోని అరెస్టు నిబంధనలను తొలగించాలని, వ్యాపారులపై వేధింపులు ఆపాలని జీఎస్టీ కౌన్సిల్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ కోరారు.

జీఎస్టీలో అరెస్టులు వద్దు

  • ఆ నిబంధన వెంటనే తొలగించండి

  • జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో పయ్యావుల కేశవ్‌ ప్రతిపాదన

న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ చట్టంలోని అరెస్టు నిబంధనలను తొలగించాలని, వ్యాపారులపై వేధింపులు ఆపాలని జీఎస్టీ కౌన్సిల్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ కోరారు. ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి ఆయన హాజరయ్యారు. జీఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 69 కింద అధికారులకు ఉన్న అరెస్ట్‌ అధికారాలను వెంటనే ఉపసంహరించాలని కౌన్సిల్‌ను పయ్యావుల గట్టిగా కోరారు. ప్రాసిక్యూషన్‌ ప్రారంభించేందుకు ఉన్న కనీస ఆర్థిక పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 1 కోటి నుంచి రూ. 5 కోట్లకు పెంచాలని సూచించారు. గరిష్ఠ పెనాల్టీని రూ. 25,000 నుంచి రూ. 10,000కు తగ్గించాలని, రూ.10,000 లోపు పన్ను వివాదాలకు అసలు షోకాజ్‌ నోటీసులే జారీ చేయకుండా నిబంధన తీసుకురావాలని ప్రతిపాదించారు.

నాన్‌-ఫ్రాడ్‌ కేసుల్లో 5 శాతం నామమాత్రపు పెనాల్టీ మాత్రమే వర్తింపజేయాలని కోరారు. పక్కా ఇంటెలిజెన్స్‌ సమాచారం ఉండి, జాయింట్‌ కమిషనర్‌ లేదా అంతకంటే ఉన్నత స్థాయి అధికారి రాతపూర్వక అనుమతి ఇస్తేనేతప్ప వాహనాలను అడ్డుకోకూడదని, సీజ్‌ చేయరాదన్నారు. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులు విక్రయించే చిన్న వ్యాపారులకు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక భవనాలు, స్థలాలు లేకపోయినా.. అక్కడి వేర్‌హౌ్‌సనే ప్రధాన వ్యాపార కేంద్రంగా చూపి సులభంగా ఆటోమేటిక్‌ రిజిస్ట్రేషన్‌ పొందేలా నిబంధనలు సడలించాలని పయ్యావుల కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 05:14 AM