Share News

నేలకు కొత్త ఊపిరి

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:38 AM

వర్షాభావంతో భూమిలో తేమశాతం తగ్గిపోతోంది. కర్బనం తగ్గి సూక్ష్మ పోషకాల లోపం ఏర్పడుతోంది. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పెరగడంతో భూసారం నానాటికీ తగ్గిపోతోంది. దీని ప్రభావంతో పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి.

నేలకు కొత్త ఊపిరి

  • ‘బయోచార్‌’తో పెరుగుతున్న భూసారం

  • శ్రీసత్యసాయి జిల్లాలోవినూత్న ప్రాజెక్టు

  • పంట వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ

  • రసాయన ఎరువుల వినియోగానికి చెక్‌

  • రైతులకు తక్కువ ధరకే బయోచార్‌ ఎరువు

  • మల్బరీ, చిరుధాన్యాల సాగులో సత్ఫలితాలు

(పుట్టపర్తి/చిలమత్తూరు-ఆంధ్రజ్యోతి): వర్షాభావంతో భూమిలో తేమశాతం తగ్గిపోతోంది. కర్బనం తగ్గి సూక్ష్మ పోషకాల లోపం ఏర్పడుతోంది. పంటలకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం పెరగడంతో భూసారం నానాటికీ తగ్గిపోతోంది. దీని ప్రభావంతో పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. చీడపీడల బెడద తీవ్రమైంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కొందరు ఔత్సాహికులు సంప్రదాయ పద్ధతులకు తిరిగి జీవం పోస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రభుత్వం తోడ్పాటుతో అలాంటి ప్రయోగమే జరుగుతోంది. అదే.. బయోచార్‌ తయారీ. ‘ప్రాజెక్ట్‌ పునరుజ్జీవం’ పేరిట చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే మల్బరీని ఇందుకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ వివరించారు.

బయోచార్‌ అంటే..?

పంట వ్యర్థాలను నిర్దిష్ట ఉష్ణోగ్రతలో తక్కువ ఆక్సిజన్‌తో కాల్చి, బొగ్గుగా మారుస్తారు. వీటిని వినియోగించి సారవంతమైన ఎరువుగా మారుస్తారు. రాష్ట్రంలోని మల్చరీలో 46.2 శాతం శ్రీసత్యసాయి జిల్లాలోనే సాగవుతోంది. పట్టు పురుగుల పెంపకం షెడ్లులో మిగిలిన ఆకులు, కొమ్మలను రైతుల నుంచి ఎఫ్‌పీవోలు(రైతు ఉత్పత్తిదారుల సంస్థ), స్వయం సహాయక సంఘాల మహిళలు సేకరించి కోడూరు సమీపంలోని ప్రాజెక్టుకు పంపుతున్నారు. మల్బరీ కర్రలను, వ్యర్థాలను 15 శాతం తేమ వచ్చే దాకా 4, 5 రోజులు ఎండబెడతారు. అనంతరం బట్టీలో 45, 60 నిమిషాలు పరిమిత ఆక్సిజన్‌, ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఆ తర్వాత నీళ్లు పోసి ఆర్పేస్తారు. కర్రలు, ఆకులను ఇలా మండించిన తరువాత వచ్చే బొగ్గు, మసిని బయోచార్‌ అని పిలుస్తారు.


ప్రపంచంలో మొదటిది..

కోడూరులోని బయోచార్‌ ప్రాజెక్టు ద్వారా ఐదేళ్లలో ఐదు వేల ఎకరాల్లో భూసారాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. నాలుగు వేల టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాతావరణంలో కలవకుండా, పర్యావరణహితంగా ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టారు. మల్బరీ సాగులో బయోచార్‌ను వినియోగించడం ద్వారా ప్రపంచంలోనే మొట్టమెదటి ‘కార్బన్‌ నెగిటివ్‌ సిల్క్‌’ తయారు చేసిన ప్రాంతం ఇదేనని చెప్పవచ్చు.

ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పూలచెట్లపల్లికి చెందిన తేజస్‌ ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేశారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యా రు. వ్యవసాయంపై మక్కువతో స్వదేశానికి వచ్చారు తేజస్‌. భూసారాన్ని పెంచేందుకు పూర్వీకులు పాటించిన బయోచార్‌ గురించి అధ్యయనం చేసి, ఆచరణలోకి తెచ్చారు. నాలుగేళ్ల పాటు ప్రయోగాత్మకంగా సాగిన ప్రాజెక్టు సత్ఫలితాలు ఇవ్వడంతో మరింత విస్తృతం చేసేందుకు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ను కలిశారు. అలా ప్రభుత్వ భాగస్వామ్యానికి అడుగు పడింది. కోడూరు సమీపంలో ఐదు ఎకరాల స్థలాన్ని ‘ప్రాజెక్టు పునరుజ్జీవనం’కు కేటాయించారు.

ఎరువుగా తయారీ

బొగ్గు రూపంలోని బయోచార్‌ను మెత్తగా దంచుతారు. దానికి రెండు కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు, జీవామృతం కలుపుతారు. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడకుండా తొట్టెలో మగ్గబెడతారు. దానిపై వారం రోజుల పాటు నీరు చల్లుతారు. తద్వారా అది జీవం పోసుకున్న బయోచార్‌గా మారుతుంది. దానిని కంపో్‌స్టతో కలిపి అవసరమైన జీవ ఎరువులకు కలుపుతారు. దీన్ని సంచుల్లో ప్యాక్‌ చేసి రైతులకు తక్కువ ధరకు అందిస్తారు.


భూసారం పెరుగుతుంది

బయోచార్‌ వినియోగం ద్వారా భూసారం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు వ్యవసాయ వ్యర్థాలే వనరులు. సేంద్రియ కర్బనం అధికంగా ఉన్నప్పుడే భూసారం పెరిగి పంటలు బాగా పండుతాయి. నేల కూడా తేమను నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. ప్రకృతిలో ఏదీ వ్యర్థం కాదు. సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ప్రకృతి మనకు తిరిగి సంపదను ఇస్తుంది. ఈ ఆలోచనతోనే ‘ప్రాజెక్టు పునరుజ్జీవనం’ రూపకల్పన చేసి, ఆచరణలోకి తీసుకువచ్చాం.

- శ్యాంప్రసాద్‌, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌

నాలుగేళ్ల శ్రమ..

రైతులు రసాయనిక ఎరువులను ఇష్టానుసారంగా ఉపయోగించడం వలన భూమి పూర్తిగా కలుషితమై, నిస్సారంగా మారింది. ఇలాంటి సమయంలోనే మన పూర్వీకులు పంట వ్యర్థాలను ఎరువులుగా మార్చిన విధానం నాకు స్ఫురణకు వచ్చిం ది. ఆ ఆలోచనతో బయోచార్‌ తయారీకి నాలుగేళ్లు నిరంతరం శ్రమించాను. ఎన్నో ప్రయోగాలు చేసి తుదకు పంట, నేలకు జీవం పోసే బయోచార్‌ని తయారు చేశాను. ప్రకృతి సేద్యం వైపు రైతులను మళ్లించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశాం.

- తేజస్‌, బయోచార్‌ ప్రాజెక్టు వ్యవస్థాపకుడు


సమన్వయంతో ముందుకు

ఈ ప్రాజెక్టులో కలెక్టరేట్‌, జిల్లా వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్‌, డీఆర్‌డీఏ, వెలుగు, పట్టుపరిశ్రమ శాఖ భాగమయ్యాయి. చిలమత్తూరు మహిళా రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం, కోడూరు గ్రామ పంచాయతీ, బయోచార్‌ ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ ఇందులో వాటాదారులుగా ఉన్నాయి. ప్రాజెక్టు పెట్టుబడి అంచనా రూ.కోటి కాగా, ఓ ప్రైవేట్‌ సంస్థ సీఎస్ఆర్‌ రూపంలో కొంత సొమ్ము సమకూర్చింది. నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ కింద డీఆర్‌డీఏ రూ.48 లక్షలు సమకూర్చింది. ఐఐటీ గువాహటి అనుబంధ సంస్థ 2.డీవో ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకుంది. యూకేకు చెందిన రెయిన్‌బోహన్‌ సంస్థతో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి అయింది. రాయలసీమలో పొలాల నుంచి కాలుష్యాన్ని తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడటం, నీటి వినియోగం తగ్గించడాన్ని బయోచార్‌ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కసారి బయోచార్‌ని చల్లితే నాలుగేళ్లు ఎరువులు వేసే పని ఉండదు. ఈ ఎరువు వాడటం వల్ల మల్బరీ ఆకుల నాణ్యత, పట్టుగూళ్ల బలం పెరిగినట్లు తేలింది. చిరుధాన్యాల పంట సాగులోనూ మొక్కల పెరుగుదల బాగా ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 04:38 AM