ఈపీడీసీఎల్ సన్నద్ధంగా ఉంది
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:22 AM
అక్వాన్ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ పూర్తి సన్నద్ధతతో ఉంది. ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాం అని సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు.
12 జిల్లాల్లో 703 ప్రత్యేక బృందాలు
24,400 విద్యుత్ స్తంభాలు
1,848 ట్రాన్స్‌ఫార్మర్లు: సీఎండీ పృథ్వీతేజ్
విశాఖపట్నం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘అక్వాన్ తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ పూర్తి సన్నద్ధతతో ఉంది. ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాం’ అని సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘టెలికాన్ఫరెన్స్‌లో డైరెక్టర్లు, సీజీఎంలు, ఈఈలను అప్రమత్తం చేశాం. ఈదురు గాలులు, భారీవర్షాలకు విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినే అవకాశం ఉంది.
ముందుగానే అవసరమైన సిబ్బందిని, వాహనాలను, సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించాం. విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వీలైనంత త్వరగా సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం. సంస్థ పరిధిలోని 12 జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం 8,161 మంది సిబ్బందితో 703 బృందాలను సిద్ధం చేశాం.
332 డీజిల్ జనరేటర్లు, 427 సామిషన్లు, 371 పోలింగ్ డ్రిల్లింగ్ మిషన్లు, 306 క్రేన్లు, 179 జేసీబీలను అందుబాటులో ఉంచాం. అదేవిధంగా 24 ,400 విద్యుత్ స్తంభాలు, 1,848 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 4000 కి.మీ.కు అవసరమైన వైర్లు, విద్యుత్ కండక్టర్లు సిద్ధం చేశాం. తుఫాను అంతరాయాల వివరాలను సేకరించేందుకు కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. గంట గంటకు నివేదికలు తయారుచేసి విపత్తు నిర్వహణ శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించాం.
ముఖ్యంగా ఆస్పత్రులు, తాగునీటి పథకాలు, అత్యవసర సేవా కేంద్రాలు, టెలికాం టవర్లు, విపత్తు నిర్వహణ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా ఆదేశాలు ఇచ్చాం. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో పాల్గొనే సిబ్బందికి భద్రత కోసం హెల్మెట్లు, హ్యాండ్ గ్లౌజులు, రెయిన్ కోట్లు, గమ్‌బూట్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించాం. విద్యుత్‌కు సంబంధించి ఏ సమాచారం కావాలన్నా 1912కు ఫోన్ చేయాలి’ అని సీఎండీ సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు