Share News

అభ్యర్థి కోరితే పోలీసు ఎస్కార్ట్‌!

ABN , Publish Date - Nov 15 , 2026 | 01:18 AM

పంచాయతీ ఎన్నికల్లో.. అభ్యర్థి పోలీసు భద్రత కావాలని కలెక్టర్‌ను, ఎస్పీ డీఎస్పీలను కోరితే ఎస్కార్ట్‌ సదుపాయం ఇస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.

అభ్యర్థి కోరితే పోలీసు ఎస్కార్ట్‌!

  • ప్రతి నామినేషన్‌ కేంద్రంలో సీసీటీవీ, వీడియో కవరేజీ: కమిషనర్‌

  • శాంతిభద్రతలు మా మొదటి ప్రాధాన్యం

  • అవసరమైతే అదనపు బలగాలు

  • పంచాయతీల ఏకగ్రీవాలు మంచిదే

  • ఆన్‌లైన్‌లో నామినేషన్లకు టైం పడుతుంది

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పునేఠా

తిరుపతి(టీటీడీ), నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో.. అభ్యర్థి పోలీసు భద్రత కావాలని కలెక్టర్‌ను, ఎస్పీ డీఎస్పీలను కోరితే ఎస్కార్ట్‌ సదుపాయం ఇస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ప్రతి నామినేషన్‌ కేంద్రంలో, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలతోపాటు వీడియో ఫోటోగ్రఫీ కవరేజీ ఉంటుందన్నారు. అవకతవకలు జరిగితే రికార్డవుతుందని చెప్పారు. ఎక్కడైనా ఫిర్యాదులు, పిటిషన్లు వస్తే పరిశీలించి.. అందులో నిజమైనవి ఉంటే నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. శనివారం తిరుపతిలో కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, ఐజీ రాజకుమారి, ఎన్నికల పరిశీలకుడు ఎం.వరప్రసాద్‌ తదితర అధికారులతో కలిసి ఆయన పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలు సరిగా ఉంటే నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకొస్తారని, ఓటర్లు సైతం ప్రశాంత వాతావరణంలో తమ ఓటు వేస్తారని కమిషనర్‌ చెప్పారు. శాంతిభద్రతలు తమ తొలి ప్రాధాన్యమన్నారు. పోలీసులు అందరినీ సమానంగా చూడాలని సూచించారు. నామినేషన్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేశామని తెలిపారు. ఉదాహరణకు శ్రీకాళహస్తిలో మున్సిపల్‌ కార్యాలయంతోపాటు ఆర్డీవో కార్యాలయంలోనూ నామినేషన్‌ వేసే అవకాశం కల్పించామన్నారు. అవసరమైతే జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోనూ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతారని వెల్లడించారు. ఇతర జిల్లాల్లోనూ ఎక్కడెక్కడ అవసరమో ఆయా చోట్ల కలెక్టరేట్లలో నామినేషన్‌ వేసుకునే సదుపాయం కల్పిస్తారని స్పష్టం చేశారు.


కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని.. తిరుపతిలో 12 జిల్లాల ఎస్పీలు, ఐజీ, డీఐజీలతో భేటీ ఏర్పాటు చేశామని చెప్పారు. డీజీపీ తరపున అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఈసీ నుంచి ఐజీ రాజకుమారి కూడా హాజరయ్యారని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలతోపాటు పంచాయతీల్లోనూ శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు చర్యలు చేపట్టామని.. అవసరమైతే రాష్ట్రస్థాయి నుంచి అదనపు బలగాలు పంపించేందుకు సిద్ధమని చెప్పారు.

పంచాయతీల్లో 15 నుంచి 20 శాతం వరకు ఏకగ్రీవాలు జరగొచ్చని భావిస్తున్నారని తెలిపారు. ‘ఏకగ్రీవం కావడం వల్ల జిల్లా యంత్రాంగం, ఎస్పీలపై పనిభారం తగ్గుతుంది. అయితే ఎక్కడా అభ్యర్థులపై ఒత్తిడి తీసుకురాకూడదు. బలవంతం చేయకూడద’ అని చెప్పారు. ఆన్‌లైన్‌ నామినేషన్ల దాఖలు ప్రక్రియను స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టాలంటే సమయం పడుతుందని అన్నారు.

ప్రమాణ స్వీకారం చేసినరోజు నుంచే..

100 పట్టణ స్థానిక స్థానిక సంస్థల్లో పాలకవర్గాలు ఈ నెల 23 తేదీన కొలువుతీరతాయని.. డిప్యూటీ మేయర్‌/డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక అదే రోజు జరుగుతుందని కమిషనర్‌ చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఐదేళ్ల పదవీకాలం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఎంపీపీ ఎన్నికలు 19న, జడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నిక 20న నిర్వహిస్తామన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 01:22 AM