Share News

శాప్ కార్యాలయం వద్ద అల్లర్లపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం

ABN , Publish Date - Sep 21 , 2026 | 01:34 PM

విజయవాడలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పందించారు. శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు అల్లర్లకు పాల్పడ్డారని ఆరోపించిన ఆయన.. టీచర్లపై దాడికి యత్నించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇలాంటి అల్లర్లను సహించేది లేదని స్పష్టం చేశారు.

శాప్ కార్యాలయం వద్ద అల్లర్లపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం
AP DSC Sports Quota

విజయవాడ, సెప్టెంబర్ 21: నగరంలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వివాదం నేపథ్యంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దేవినేని అవినాష్, జోగి రమేష్ ఆధ్వర్యంలో రౌడీమూకలు రాళ్లు, కోడిగుడ్లతో హంగామా చేశారని మంత్రి విమర్శించారు. టీచర్లపై దాడికి యత్నించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శాప్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అల్లర్లు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించబోదని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. టీచర్లపై దాడులకు పాల్పడినట్లు తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


వైసీపీ కుట్ర రాజకీయాలు.. టీచర్లపై దాడి సరికాదు: ఎమ్మెల్యే ఏలూరి

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయంటూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి రౌడీషీటర్లను తీసుకొచ్చి టీచర్లపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులు తమపై వస్తున్న ఆరోపణలపై న్యాయం చేయాలని కోరేందుకు వచ్చారని.. అలాంటి వారిపై దాడికి ప్రయత్నించడం సరికాదన్నారు.

గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి 11 సీట్లు ఇచ్చినా వైసీపీ నేతల వైఖరిలో మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. డీఎస్సీ నియామకాలను అడ్డుకునేందుకు గతంలో కేసులు, న్యాయపరమైన ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదని ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యారంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మంచి పేరు వస్తుండటాన్ని తట్టుకోలేకే వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.


ఈ వార్తలూ చదవండి

తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడు.. కలిపిన చాట్‌జీపీటీ

సెలూన్‌లో కోతికి మసాజ్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు.

Updated Date - Sep 21 , 2026 | 01:42 PM